న్యూఢిల్లీ: ఆటగాడిగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న విరాట్ కోహ్లి త్వరలోనే ప్రపంచకప్‌ను సాధించి కెప్టెన్‌గానూ తనదైన చరిత్ర లిఖిస్తాడని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని, కాబట్టి ఐసీసీ ట్రోఫీ సాధించడం పెద్ద కష్టమేమీ కాబోదని పేర్కొన్నాడు. వరల్డ్ కప్ సాధించేంత వరకు కోహ్లి రిటైర్మైంట్ ఆలోచన చేయడని భావిస్తున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడేతో మాట్లాడిన భజ్జీ.. టీమిండియా ఈసారి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.(చదవండి: అలాంటి మధుర క్షణాలు మళ్లీ మళ్లీ రావు.. అందుకే!)
ఇక కోహ్లి ఆటతీరు, నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతూ.. ‘‘ ఏ కెప్టెన్ అయినా ఇలాంటి ఒక విజయం సాధించాలని భావిస్తాడు. విరాట్ కోహ్లి గొప్ప ఆటగాడు. ఇప్పటికే ఈ విషయాన్ని అతడు ఎన్నోసార్లు రుజువు చేశాడు. అయితే ఇంతవరకు తన ఖాతాలో వరల్డ్ కప్ ఘనత చేరలేదు. ప్రపంచకప్ సాధించిన కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావించడం సహజం. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఈ ఫీట్ సాధించవచ్చు. ప్రస్తుతం ఉన్న జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. కాబట్టి త్వరలోనే కోహ్లి ఐసీసీ ట్రోఫీని ముద్దాడగలడు.
ఇప్పుడు కాకపోతే ఆ మరుసటి ఏడాది అయినా ఈ ఘనత సొంతం చేసుకుంటాడు. మొత్తానికి ఏదో ఒక టైటిల్ సాధించకుండా తను రిటైర్ కాబోడు’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా రన్‌మెషీన్‌గా నీరాజనాలు అందుకుంటున్న కోహ్లి, ఇప్పటివరకు 70 సెంచరీలు(వన్డే, టెస్టులు) నమోదు చేశాడు. అయితే ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన అనంతరం సారథిగా టెస్టుల్లో పలు చారిత్రక విజయాలు నమోదు చేసిన కోహ్లి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఇంతవరకు అలాంటి ఘనత సాధించలేకపోయాడు. ఇక 2019 వరల్డ్ కప్‌లో లీగ్ దశలో అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన కోహ్లి సేన ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. (చదవండి: కోహ్లి ఎప్పుడూ దూకుడుగానే ఉంటాడు..)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
