అలాంటి మధుర క్షణాలు మళ్లీ మళ్లీ రావు.. అందుకే!

Ravi Shastri Says Virat Kohli Will Be Missed But His Decision Is Right - Sakshi

స్వదేశానికి తిరిగి రావాలన్న కోహ్లి నిర్ణయాన్ని సమర్థించిన రవిశాస్త్రి

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా టూర్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని కచ్చితంగా మిస్సవుతామని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. అయితే ప్రస్తుతం జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారని, కోహ్లి నిర్ణయం వల్ల తమను తాము నిరూపించుకునే అవకాశం వారికి దక్కిందని పేర్కొన్నాడు. కాగా కోహ్లి సతీమణి, హీరోయిన్‌ అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రసవ సమయంలో భార్యకు తోడుగా ఉండేందుకు అతడు పితృత్వ సెలవు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 17న మొదలయ్యే తొలి టెస్టు తర్వాత  కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్నాడు. దీంతో ఆసీస్‌తో జరిగే కీలకమైన టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో కోహ్లి నిర్ణయం.. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని మరోసారి సొంతం చేసుకోవాలన్న టీమిండియా బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపనుందని క్రికెట్‌ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు.(చదవండి: కోహ్లి దూరం: ఆ చాన్స్‌ కొట్టేస్తే లక్కీయే!)

ఈ విషయంపై తాజాగా స్పందించిన రవిశాస్త్రి... కోహ్లి సరైన నిర్ణయమే తీసుకున్నాడని అతడిని సమర్థించాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘గత ఐదారేళ్లుగా టీమిండియా విజయ పరంపరను గమనిస్తే దాని వెనుక కోహ్లి ఉన్నాడన్న విషయం సుస్పష్టమే. జట్టును ముందుండి నడిపించడంలో అతడు సఫలమయ్యాడని అందరికీ తెలుసు. అలాంటి ఆటగాడు, కెప్టెన్‌ను ఇప్పటి సిరీస్‌లో కచ్చితంగా మిస్సవుతాం. అయితే జీవితంలో అలాంటి మధుర క్షణాలు(తొలి సంతానానికి సంబంధించి) ఆస్వాదించే సమయం మళ్లీ మళ్లీ రాదు. తనకు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి లభించింది. కాబట్టే తిరిగి వెళ్తున్నాడు. అందుకు తనెంతో సంతోషంగా ఉన్నాడని భావిస్తున్నా. అతడు సరైన నిర్ణయమే తీసుకున్నాడు. అందువల్ల యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకునే అవకాశం లభించింది’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. (చదవండి: ఏంటిది కోహ్లి.. ధోనీలా ఆలోచించలేవా?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top