నేడు, రేపు పీఎం ఎలెవన్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్
కాన్‌బెర్రా: నాలుగేళ్ల క్రితం ఆ్రస్టేలియాపై టెస్టు సిరీస్ గెలిచినా... ‘పింక్ బాల్’తో జరిగిన తొలి టెస్టులో 36కు ఆలౌట్ కావడం భారత్‌ను ఎప్పటికీ వెంటాడుతుంది. అదే అడిలైడ్‌లో డిసెంబర్ 6 నుంచి ఆసీస్‌తో టీమిండియా రెండో టెస్టులో తలపడనుంది. దానికి ముందే గులాబీ బంతితో సాధన చేసేందుకు భారత్ సన్నద్ధమైంది. నేడు, రేపు మనుకా ఓవల్ మైదానంలో ప్రైమ్ మినిస్టర్ (పీఎం) ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగనుంది.
రెండు రోజుల మ్యాచే కాబట్టి ప్రధానంగా బ్యాటింగ్‌పైనే జట్టు దృష్టి పెట్టింది. తొలి టెస్టు ముగిసిన తర్వాత పెర్త్‌లోనే గులాబీ బంతితో సాధన మొదలు పెట్టిన కెపె్టన్ రోహిత్ శనివారం మ్యాచ్ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. తుది జట్టు సమస్య లేదు కాబట్టి దాదాపు అందరూ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే గత సిరీస్‌లో అడిలైడ్ టెస్టుకంటే ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు టీమిండియా అమితోత్సాహంతో ఉంది.
పెర్త్ టెస్టులో ఘన విజయం తర్వాత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ‘పింక్ బంతి’ పెద్ద సమస్య కాకపోవచ్చు. మరోవైపు టెస్టు క్రికెటర్లు మాట్ రెన్షా, స్కాట్ బోలండ్ పీఎం ఎలెవన్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. కెప్టెన్ జేక్ ఎడ్వర్డ్స్ మరో కీలక ఆటగాడు కాగా... అండర్–19 స్థాయి క్రికెటర్లు ఎక్కువ మంది టీమ్ తరఫున బరిలోకి దిగనున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. తొలి రోజు పూర్తిగా రద్దయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు!
నెట్స్‌లో జోరుగా...
ప్రాక్టీస్ మ్యాచ్ జరగడంపై సందేహంతో కాబోలు... మ్యాచ్‌కు ముందే శుక్రవారం భారత జట్టు ఆటగాళ్లు పింక్ బాల్‌తో ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. నెట్స్‌లో సుదీర్ఘ సమయం క్రికెటర్లు శ్రమించారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకుంటున్న శుబ్‌మన్ గిల్ ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం సానుకూలాంశం. పలు చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. పూర్తి ఫిట్‌గా మారితే గిల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడు.
‘పింక్ బాల్ కాస్త భిన్నంగా స్పందిస్తుందనేది వాస్తవం. అయితే అది పెద్ద సమస్య కాదు. దానికి అనుగుణంగానే సాధన చేస్తున్నాం. రెండో టెస్టుకు ముందు ఎనిమిది రోజుల విరామం ఉండటం మాకు మేలు చేస్తుంది’ అని భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ చెప్పాడు. విరాట్ కోహ్లి కూడా భారత బౌలర్లను ఎదుర్కొంటూ చాలా సమయం ప్రాక్టీస్ చేశాడు.
భారత్ సాధన చూసేందుకు గ్రౌండ్‌కు వచ్చిన అభిమానులకు కోహ్లి మంచి వినోదం అందించాడు. పంత్, రాహుల్ బ్యాటింగ్‌కంటే ఫిట్‌నెస్ డ్రిల్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టగా... బ్యాటింగ్ సాధన తర్వాత యశస్వి జైస్వాల్ సరదాగా ‘పింక్ బాల్’తో మీడియం పేస్ బౌలింగ్ సాధన చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment