గెలుపు బాట పడతారా! | Indias first T20 against England today | Sakshi
Sakshi News home page

గెలుపు బాట పడతారా!

Jul 1 2026 4:31 AM | Updated on Jul 1 2026 4:33 AM

Indias first T20 against England today

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ తొలి టి20

వైభవ్‌ సూర్యవంశీకి చాన్స్‌ దక్కేనా!

మూడు రోజుల క్రితం బెల్‌ఫాస్ట్‌లో వరుసగా రెండు ఓటముల పరాభవం... ఆ తర్వాత మూడున్నర గంటల ప్రయాణం తర్వాత మారిన దేశం, మారిన వేదిక, మారిన ప్రత్యర్థి... ఇక్కడైనా భారత జట్టు రాత మారుతుందా... గత సిరీస్‌లోని ప్రత్యర్థితో పోలిస్తే మరింత బలమైన జట్టు ఎదురుగా ఉండగా టీమిండియా గెలుపు బాట పడుతుందా అనేదే ప్రశ్న... సొంతగడ్డపై సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్‌ను నిలువరించి భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఎలాంటి ఫలితం రాబడుతుందనేది ఆసక్తికరం.

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఈరోజు తెర లేవనుంది. నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్ల తలపడనున్నాయి. ఐర్లాండ్‌ చేతిలో 0–2తో సిరీస్‌ ఓడిన భారత్‌ ఇక్కడైనా సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ సహా పలువురు కీలక ఆటగాళ్లు సోమవారం కివీస్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత తక్కువ వ్యవధిలో టి20 సమరానికి సిద్ధమయ్యారు. సొంతగడ్డపై ఆడుతున్న ప్రత్యరి్థతో పోలిస్తే భారత్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. దాదాపు ఐర్లాండ్‌ తరహాలోనే ఇక్కడి రివర్‌సైడ్‌ గ్రౌండ్‌ పిచ్‌ ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమానంగా అనుకూలిస్తుంది.  

శ్రేయస్‌ అయ్యర్‌కు కీలకం
ఐర్లాండ్‌ చేతిలో ఓడిన తర్వాత పెద్ద సంఖ్యలో అభిమానులు, విశ్లేషకుల నుంచి ఒకే ప్రశ్న ఎదురైంది. వైభవ్‌ సూర్యవంశీని ఆడించే ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో అని అంతా అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం జట్టు పరిస్థితి చూస్తే వైభవ్‌తో మాత్రమే పరిష్కారం లభించేలా లేదు. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన సామ్సన్, ఇషాన్‌ కిషన్‌లలో ఒకరిని పక్కన పెట్టి ముందుగా వైభవ్‌ను ఆడిస్తారా అనేది చర్చనీయాంశం. ఒకవేళ అతను బరిలోకి దిగినా... ఇతర బ్యాటర్లు కూడా రాణించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో తొలి బంతికే అవుటైన అభిషేక్‌ శర్మతో పాటు తిలక్‌ వర్మ కూడా ధాటిని ప్రదర్శించాలి. 

శివమ్‌ దూబే చాలా కాలంగా బ్యాటింగ్‌లో ప్రభావం చూపించడం లేదు. గత టి20లో ఆడిన సూర్యాంశ్‌కు మరో అవకాశం ఇస్తారా చూడాలి. అయితే వరుణ్‌ చక్రవర్తి రాకతో స్పిన్‌ బలం కాస్త పెరిగింది. పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ను తప్పించి వరుణ్‌ను ఆడించడం దాదాపు ఖాయం. అన్నింటికి మించి ఈ సిరీస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కీలకం కానుంది. రెండేళ్ల తర్వాత టి20 టీమ్‌లోకి అదీ సారథిగా అవకాశం దక్కించుకున్న అతను అటు బ్యాటర్‌గా, ఇటు నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. మున్ముందు తీవ్ర విమర్శల నుంచి తప్పించుకోవాలంటే ఇంగ్లండ్‌లో అతను చాలా ప్రభావం చూపించాల్సి ఉంటుంది.  

బట్లర్‌పై దృష్టి... 
టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌తో తలపడిన టి20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1–4తో చిత్తుగా ఓడింది. ఇప్పుడు దానికి సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ భావిస్తోంది. ఈ సిరీస్‌లో, ఆ తర్వాత వరల్డ్‌కప్‌లోనూ విఫలమైనా... బట్లర్‌ తన స్థానం నిలబెట్టుకున్నాడు. అతని కెరీర్‌ భవిష్యత్తుకు సంబంధించి ఇది కీలక సిరీస్‌ కానుంది. టెస్టు మ్యాచ్‌ తర్వాత ఎలాంటి సాధన లేకుండా నేరుగా బరిలోకి దిగేందుకు సిద్ధమైన కెప్టెన్‌ ఎలా ఆడతాడనేది చూడాలి. పేసర్‌ ఆర్చర్‌కు కూడా ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి లభించింది. అయితే విధ్వంసక బ్యాటర్లు సాల్ట్, జాక్స్, బెతెల్‌ చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌ కీలకం కాగా... ప్రధాన స్పిన్నర్‌గా ఆదిల్‌ రషీద్‌పై జట్టు ఆధారపడుతోంది.

80 భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన మొత్తం టి20 మ్యాచ్‌లు. 18 మ్యాచ్‌ల్లో భారత్‌... 12 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలుపొందాయి. ఇంగ్లండ్‌లో ఈ రెండు జట్లు 9 టి20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్‌ 4 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement