
నేడు ఇరాక్‌తో మ్యాచ్
ఆసియా కప్–2026 మహిళల ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీ
చియాంగ్ మాయ్ (థాయ్‌లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్’పై కన్నేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో అద్వితీయ విజయాలు సాధించిన భారత్... బుధవారం మూడో మ్యాచ్‌లో ఇరాక్‌తో పోటీపడనుంది. గ్రూప్ ‘బి’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైంది. తిమోర్ లెస్టెతో జరిగిన గత పోరులో సౌమ్య ముక్కుకు బలమైన గాయమైంది.
తొలి మ్యాచ్‌లో మంగోలియాపై 13–0 గోల్స్ తేడాతో గెలిచిన మన అమ్మాయిలు... రెండో మ్యాచ్‌లో తిమోర్ లెస్టెపై 4–0 గోల్స్‌తో నెగ్గారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరు కొనసాగిస్తూ మరో భారీ విజయం ఖాతాలో వేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గ్రూప్‌లో భాగంగా శనివారం ఆతిథ్య థాయ్‌లాండ్‌తో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. అంతకుముందే అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది. ‘థాయ్‌లాండ్‌తో చివరి మ్యాచ్ ఆడనున్నాం.
అయితే ప్రస్తుతానికి మా దృష్టి ఇరాక్‌తో పోరుపైనే ఉంది. మంగోలియాపై థాయ్‌లాండ్ ఎన్ని గోల్స్ సాధిస్తుంది... మేము ఇరాక్‌పై ఎన్ని సాధించాలనే లెక్కలు పక్కన పెట్టి సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతాం. గత మ్యాచ్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని మెరుగవ్వాల్సిన విషయాల్లో మరింత సాధన చేశాం. ఒక్కో ప్లేయర్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. ఇరాక్‌తో మ్యాచ్‌ను తేలికగా తీసుకోవడం లేదు. అందరికీ అవకాశం ఇస్తూ... చివరి మ్యాచ్ వరకు తాజాగా ఉంచాలనుకుంటున్నాం. రొటేషన్ పద్ధతిని సరిగ్గా వినియోగించుకుంటాం’ అని భారత కోచ్ క్రిస్పన్ ఛెత్రీ పేర్కొన్నాడు.
ఈ టోర్నీ కోసం భారత జట్టు 23 మంది ప్లేయర్లను ఎంపిక చేయగా... గత రెండు మ్యాచ్‌ల్లో 22 మందికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. సరైన సమయంలో ప్లేయర్లకు విశ్రాంతినిస్తూ... సబ్‌స్టిట్యూట్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోనే ఇది సాధ్యమైంది. మరోవైపు టోర్నీలో మూడు మ్యాచ్‌లాడిన ఇరాక్... ఒక విజయం, ఒక ఓటమి, ఒక ‘డ్రా’తో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక మూడో స్థానంలో ఉంది. ప్రపంచ 173వ ర్యాంకర్ ఇరాక్... ఇదే టోర్నీలో తమ తొలి అంతర్జాతీయ విజయం (మంగోలియాపై 5–2 గోల్స్‌తో) నమోదు చేసుకుంది.