
కాంపౌండ్ విభాగంలో ఫైనల్ చేరిన భారత పురుషుల, మహిళల జట్లు
శనివారం మెక్సికో జట్లతో పసిడి పోరు
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా భారత్ ఖాతాలో కనీసం రెండు స్వర్ణాలు లేదా రెండు రజతాలు చేరనున్నాయి.
వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర)లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు... అభిõÙక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలేలతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. మరోవైపు మెక్సికో పురుషుల, మహిళల జట్లు కూడా ఫైనల్లోకి అడుగు పెట్టాయి. శనివారం భారత్, మెక్సికో జట్లు రెండు స్వర్ణాల కోసం పోటీపడతాయి.
క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచినందుకు... భారత జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు 232–229 పాయింట్ల తేడాతో అదెల్ జెక్సెన్‌బినోవా, విక్టోరియా లియాన్, రొక్సానా యునోసోవాలతో కూడిన కజకిస్తాన్ జట్టును ఓడించింది. సెమీఫైనల్లో భారత జట్టు 232–230 పాయింట్లతో ఎల్లా గిబ్సన్, ఇసబెల్లా కార్పెంటర్, లేలా అనిసన్‌లతో కూడిన బ్రిటన్ జట్టుపై గెలిచింది.
క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 239–232 పాయింట్ల తేడాతో అజయ్ స్కాట్, ఆడమ్ కార్పెంటర్, ల్యూక్ డేవిస్‌లతో కూడిన బ్రిటన్ జట్టుపై నెగ్గింది. సెమీఫైనల్లో భారత బృందం 232–231 పాయింట్ల తేడాతో మథియాస్ ఫులర్టన్, మారి్టన్ డామ్స్‌బో, నిక్లాస్ బ్రెడాల్‌లతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది.
తొమ్మిదో స్థానంలో ధీరజ్
బుధవారం జరిగిన రికర్వ్ విభాగం పురుషుల క్వాలిఫయింగ్‌లో భారత ఆర్చర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. పారిస్ ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 677 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 666 పాయింట్లతో తరుణ్‌దీప్ రాయ్ 28వ స్థానంలో, 652 పాయింట్లతో అతాను దాస్ 57వ స్థానంలో, 651 పాయింట్లతో పార్థ్ సాలుంఖే 60వ స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా 1995 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన భారత్‌కు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.
రికర్వ్ విభాగం మహిళల క్వాలిఫయింగ్‌లో భారత స్టార్ దీపిక కుమారి 655 పాయింట్లు సాధించి 12వ స్థానాన్ని దక్కించుకుంది. 652 పాయింట్లతో అంకిత 17వ స్థానంలో, 642 పాయింట్లతో అన్షిక 29వ స్థానంలో, 637 పాయింట్లతో సిమ్రన్‌జిత్ కౌర్ 39వ స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా 1949 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు తొలి రౌండ్‌లో ‘బై’ దక్కింది.