గెలిస్తేనే... సిరీస్‌లో నిలుస్తాం

India Women vs South Africa Women 4th ODI - Sakshi

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత్‌ నాలుగో వన్డే నేడు

ఉదయం 9 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

లక్నో: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో వెనుకబడిన భారత మహిళల జట్టు కఠిన సవాల్‌ ముందు నిలబడింది. ఆదివారం జరిగే నాలుగో వన్డేలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో మిథాలీ సేన నిలిచింది. లేదంటే ఈ మ్యాచ్‌ ఓడితే ఐదు వన్డేల సిరీస్‌ను ఆఖరి వన్డేకు ముందే ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 2–1తో ముందంజలో ఉన్న దక్షిణాఫ్రికా మహిళలు... సిరీసే లక్ష్యంగా నాలుగో వన్డే బరిలోకి దిగుతున్నారు. మరోవైపు తీవ్ర ఒత్తిడిలో ఉన్న మిథాలీ జట్టు సర్వశక్తులు ఒడ్డి అయినా సిరీస్‌లో సజీవంగా నిలవాలని ఆశిస్తోంది. గడిచిన మూడు మ్యాచ్‌ల్లో నిలకడలేని టాపార్డర్‌ ప్రదర్శన జట్టుకు సమస్యగా మారింది. యువ ఓపెనర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ వరుసగా 1, 9, 0లతో తీవ్రంగా నిరాశ పరిచింది.

తొలి వన్డేలో విఫలమైన స్మృతి మంధాన రెండో వన్డేలో అదరగొట్టింది. కానీ గత మ్యాచ్‌లో దాన్ని పునరావృతం చేయలేకపోయింది. పూనమ్‌ రౌత్‌ మాత్రం గత రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధసెంచరీలతో ఫామ్‌లోకి వచ్చింది. ఈ టాప్‌–3 బ్యాటర్స్‌ పటిష్టమైన పునాది వేస్తే కెప్టెన్‌ మిథాలీ రాజ్, ఆల్‌రౌండర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మిగతా ఇన్నింగ్స్‌ను నిలబెడతారు. ఇక దక్షిణాఫ్రికా మహిళల జట్టులో ఓపెనర్‌ లిజెల్‌ లీ టాప్‌ ఫామ్‌లో ఉంది. సఫారీ గెలిచిన తొలి, మూడో వన్డేల్లో ఆమె అర్ధసెంచరీ, అజేయ సెంచరీలతో కీలక భూమిక పోషించింది. ఈ నేపథ్యంలో మిథాలీ సేన లిజెల్‌ లీని తక్కువ స్కోరుకే కట్టడి చేస్తే మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ పట్టుబిగించేందుకు ఆస్కారముంటుంది. అనుభవజ్ఞురాలైన వెటరన్‌ సీమర్‌ జులన్‌ గోస్వామి నిప్పులు చెరిగితే భారత మహిళల జట్టు 2–2తో సమం చేసే అవకాశాలు మెరుగవుతాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top