
నేడు ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు చివరి వన్డే
సాయంత్రం గం. 5:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
చెస్టర్–లీ–స్ట్రీట్: ఇంగ్లండ్ పర్యటనలో అంచనాలకు మించి రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు విజయంతో ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 3–2తో గెలుచుకున్న భారత్... ఇప్పుడు వన్డే సిరీస్‌లో 1–1తో సమంగా ఉంది. నేడు జరిగే చివరి వన్డేలో నెగ్గితే ఈ సిరీస్ కూడా మన సొంతమవుతుంది. దాదాపు మూడేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపైనే జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 3–0తో గెలుచుకొని సత్తా చాటింది.
నాటి సిరీస్ ఆడిన హర్మన్, స్మృతి, దీప్తి, హర్లీన్ ఇప్పుడు కూడా బరిలో ఉన్నారు. టూర్ ఆసాంతం ఆకట్టుకున్న హర్మన్ బృందం మరో మ్యాచ్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే గెలుపు సొంతమవుతుంది. తొలి వన్డేలో నెగ్గిన అనంతరం వర్షం బారిన పడిన రెండో మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్ కాస్త తడబడింది. దూకుడుగా ఆడే ప్రయత్నంలో బ్యాటర్లు చెత్త షాట్లతో వెనుదిరిగారు.
స్మృతి, దీప్తి రాణిస్తుండగా... ప్రతీక, హర్లీన్, జెమీమా కూడా మెరుగైన స్కోర్లు సాధించాల్సి ఉంది. టూర్‌లో ఆడిన 6 మ్యాచ్‌లలో కెపె్టన్ హర్మన్‌ప్రీత్ ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. జట్టు గెలిచినా ఆమె బ్యాటింగ్ పేలవంగా సాగింది. ఈ సారైనా ఒక మంచి ఇన్నింగ్స్‌తో హర్మన్ ముగించాలని టీమ్ కోరుకుంటోంది. మరో వైపు టి20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ వన్డే సిరీస్‌నైనా గెలిచి స్వదేశంలో పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో గెలుపు ఆ జట్టులో కాస్త ఉత్సాహాన్ని పెంచింది. సీనియర్లయిన కెప్టెన్ నాట్ సివర్, బీమాంట్, డంక్లీ, ఎకెల్‌స్టోన్ మెరుగ్గా ఆడుతుండటం సానుకూలాంశం.