IND vs LEI: రాణించిన శ్రీకర్‌ భరత్‌.. టీమిండియా స్కోర్‌: 246/8

India vs Leicestershire: KS Bharat The Saviour As India Reach 246 8 - Sakshi

లీస్టర్‌: ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (111 బంతుల్లో 70 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అదరగొట్టాడు. లీస్టర్‌షైర్‌ బౌలర్లకు స్టార్‌ బ్యాటర్లంతా తలొగ్గితే తను మాత్రం చక్కని పోరాటం చేశాడు. సన్నాహక మ్యాచ్‌లో మొదటి రోజు కౌంటీ జట్టు బౌలర్ల ప్రతాపమే పూర్తి పైచేయి కాకుండా భరత్‌ అడ్డుగా, అజేయంగా నిలిచాడు. దీంతో గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (25; 3 ఫోర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (21; 4 ఫోర్లు) పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. టెస్టు స్పెషలిస్ట్‌ హనుమ విహారి (3), శ్రేయస్‌ అయ్యర్‌ (0) నిరాశ పరిచారు. విరాట్‌ కోహ్లి (69 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆడినంతసేపు తన శైలి షాట్లతో అలరించాడు. రవీంద్ర జడేజా (13) కూడా చేతులెత్తేయగా 81 పరుగులకే భారత్‌ 5 ప్రధాన వికెట్లను కోల్పోయింది.

ఈ దశలో కోహ్లితో జతకట్టిన శ్రీకర్‌ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో చప్పగా సాగుతున్న స్కోరు బోర్డుకు ఊపుతెచ్చారు. ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించాక కోహ్లి నిష్క్రమించాడు. శార్దుల్‌ ఠాకూర్‌ (6) ఓ ఫోర్‌కొట్టి పెవిలియన్‌ బాట పట్టగా... టెయిలెండర్లలో ఉమేశ్‌ యాదవ్‌ (23; 4 ఫోర్లు) నిలబడటంతో శ్రీకర్‌ భరత్‌ జట్టు స్కోరును 200 పరుగులు దాటించగలిగాడు.

తర్వాత షమీ (18 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా ఓర్పుగా బ్యాటింగ్‌ చేయడంతో భరత్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లీస్టర్‌షైర్‌ బౌలర్లలో రోమన్‌ వాకర్‌ 5 వికెట్లు పడగొట్టగా, విల్‌ డేవిస్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత ఆటగాళ్లలో అందరికీ ప్రాక్టీస్‌ కల్పించాలన్న ఉద్దేశంతో నలుగురు ప్రధాన ఆటగాళ్లు బుమ్రా, రిషభ్‌ పంత్, చతేశ్వర్‌ పుజారా, ప్రసిధ్‌ కృష్ణలను లీస్టర్‌షైర్‌ తరఫున ఆడించారు. వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో తొలిరోజు 60.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది.  
జట్టుతో చేరిన అశ్విన్‌ 
కరోనా నుంచి కోలుకున్న ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బుధవారం ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాడు. బుధవారమే లీస్టర్‌ చేరుకున్న అశ్విన్‌ గురువారం ఉదయమే భారత జట్టు సహచరులతో టీమ్‌ డ్రెస్‌లో మైదానానికి వచ్చినా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ బరిలోకి దిగలేదు. రెండు జట్లలోనూ అశ్విన్‌ పేరు కనిపించలేదు. అతని పూర్తి స్థాయిలో కోలుకోలేదు కాబట్టి విశ్రాంతి అవసరమని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ భావించి ఉండవచ్చు.
చదవండి:SL vs AUS: శ్రీలంకతో టెస్టు సిరీస్‌.. ఐదేళ్ల తర్వాత మాక్స్‌వెల్‌ రీ ఎంట్రీ..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top