ICC Test Rankings: ఆస్ట్రేలియాకు షాక్‌.. నంబర్‌ వన్‌ స్థానానికి టీమిండియా

India Topple Australia, Become New Number 1 In ICC Test Rankings - Sakshi

గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ, వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇవాళ (జనవరి 17) ఐసీసీ విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను వెనక్కునెట్టి అగ్రస్థానానికి దూసుకొచ్చింది. గతేడాది శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై వరుస సిరీస్‌ విజయాలు సాధించిన భారత్‌.. 115 రేటింగ్‌ పాయింట్లను ఖాతాలో వేసుకుని అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది.

సుదీర్ఘ ఫార్మాట్‌లో గతేడాది ఆస్ట్రేలియా సైతం అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ.. ఏడాది చివర్లో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయలేకపోవడం, మరోవైపు భారత్‌.. బంగ్లాదేశ్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడంతో ఇరు జట్ల స్థానాలు తారుమారయ్యాయి. ప్రస్తుతం ఆసీస్‌ (రెండో స్థానం) ఖాతాలో 111 రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. ఇంగ్లండ్‌ ఖాతాలో 106 (మూడు), న్యూజిలాండ్‌ ఖాతాలో 100 (నాలుగు), సౌతాఫ్రికా ఖాతాలో 85 (ఐదు) రేటింగ్‌ పాయిం‍ట్లు ఉన్నాయి.

కాగా, ఫిబ్రవరి 9 నుంచి భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య 4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరుగనున్న నేపథ్యంలో ర్యాంకింగ్స్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తును (ఇదివరకే ఆసీస్‌ ఫైనల్‌కు చేరుకుంది) ఖరారు చేసుకోవాలంటే, టీమిండియా ఆసీస్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో ఇదివరకే టాప్‌ ప్లేస్‌లో ఉన్న భారత్‌.. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంటే, ఈ ఫార్మాట్‌లోనూ టాప్‌కు చేరుకుంటుంది. ఇదే జరిగితే భారత్‌.. తొలిసారి మూడు ఫార్మాట్లలో టాప్‌ ప్లేస్‌లో నిలుస్తుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ 110 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ (117), ఇంగ్లండ్‌ (113), ఆస్ట్రేలియా (112) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top