మొదటి రోజు మనదే

India Tighten Screws As Australia All Out For 195 In First Innings - Sakshi

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 ఆలౌట్‌

బుమ్రా, అశ్విన్‌ ఆకట్టుకున్న సిరాజ్‌

భారత్‌ ప్రస్తుతం 36/1

అడిలైడ్‌ అపజయాన్ని అల్లంత దూరాన పెడుతూ మెల్‌బోర్న్‌ టెస్టును భారత జట్టు మెరుగైన రీతిలో ఆరంభించింది. మన బౌలర్లు మరోసారి మెరవడంతో ఆస్ట్రేలియా మళ్లీ 200 పరుగులు కూడా దాటలేకపోయింది. బుమ్రా పదునైన బౌలింగ్, అశ్విన్‌ అనుభవ ప్రదర్శనకు తోడు అరంగేట్రం టెస్టులో హైదరాబాదీ సిరాజ్‌ కూడా ఆకట్టుకోవడంతో ఆసీస్‌ జట్టులో ఒక్కరూ కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు. బదులుగా మరోసారి సున్నాకే తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా... గత మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మిగిల్చిన స్కోరు (36) వద్దే మొదటి రోజు ఆట ముగించింది. అయితే మెల్లగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతున్న పిచ్‌ రెండో రోజు మన ఆటగాళ్ల ప్రదర్శనపై ఆశలు రేపుతోంది.

మెల్‌బోర్న్‌: ఉదయం 11 మిల్లీ మీటర్ల  పచ్చికపై, కాస్త తేమ కూడా ఉన్న పిచ్‌పై బ్యాటింగ్‌ ఎంచుకొని ఆస్ట్రేలియా చేసిన సాహసం ఆ జట్టుకు పనికి రాలేదు. భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌటైంది. మార్నస్‌ లబ్‌షేన్‌ (132 బంతుల్లో 48; 4 ఫోర్లు), ట్రావిస్‌ హెడ్‌ (38), మాథ్యూ వేడ్‌ (30) మాత్రమే కొద్దిగా పరుగులు చేయగలిగారు. బుమ్రాకు 4 వికెట్లు దక్కగా, అశ్విన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 36 పరుగులు చేసింది. మయాంక్‌ ‘డకౌట్‌’కాగా... శుబ్‌మన్‌ గిల్‌ (28 బ్యాటింగ్‌), పుజారా (7 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.  

కీలక భాగస్వామ్యం...
భారత బౌలింగ్‌ పదునుకు తోడు కొన్ని చెత్త షాట్లు ఆసీస్‌ స్కోరును 200 లోపే పరిమితం చేశాయి. జట్టుకు సరైన ఓపెనింగ్‌ కూడా లభించలేదు. తన పేలవ ఫామ్‌ను కొనసాగించిన జో బర్న్స్‌ (0) బుమ్రా వేసిన చక్కటి బంతిని ఆడలేక కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. కొంత దూకుడు ప్రదర్శించిన వేడ్‌ తాను టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న విషయాన్ని మరచిపోయినట్లుగా అశ్విన్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడి వెనుదిరిగాడు. ఆ వెంటనే టాప్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ (0) కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో జట్టు కష్టాలు పెరిగాయి.

ఈ దశలో లబ్‌షేన్, హెడ్‌ 86 పరుగుల భాగస్వామ్యం ఆసీస్‌ను ఆదుకుంది. బుమ్రా బౌలింగ్‌లో లబ్‌షేన్‌ (స్కోరు 6) అవుట్‌ కోసం ఎల్బీ అప్పీల్‌ చేసిన భారత్‌... రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 26 పరుగుల వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా... ఈసారి తాను రివ్యూ కోరి లబ్‌షేన్‌ బయటపడ్డాడు. లంచ్‌ సమయానికి జట్టు 65 పరుగులు చేసింది. రెండో సెషన్‌లోనూ లబ్‌షేన్, హెడ్‌ సాధికారికంగా, చక్కటి సమన్వయంతో ఆడారు. తొలి గంటలో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయడంతో పరుగులు కూడా చకచకా వచ్చాయి.

భాగస్వామ్యం మరింత పటిష్టంగా మారుతున్న దశలో మరో పదునైన బంతితో హెడ్‌ను అవుట్‌ చేసి బుమ్రా ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే లబ్‌షేన్‌ను అవుట్‌ చేసి టెస్టుల్లో తొలి వికెట్‌ సాధించిన సిరాజ్‌... కామెరాన్‌ గ్రీన్‌ (12)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గత టెస్టు తరహాలో ఈసారి ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ జట్టును ఆదుకోలేకపోయాడు. అశ్విన్‌ బంతిని సమర్థంగా ఎదుర్కోలేక పైన్‌ (13) బ్యాక్‌వర్డ్‌ షార్ట్‌ లెగ్‌లో విహారికి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు.  

గిల్‌ అదృష్టం...
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు ఇదే మైదానంలో అరంగేట్రం చేసి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్‌ అగర్వాల్‌కు ఈసారి కలిసి రాలేదు. స్టార్క్‌ వేసిన తొలి ఓవర్లోనే మయాంక్‌ (0) వెనుదిరగడంతో స్కోరు బోర్డులో పరుగులు చేరకుండానే భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే గిల్, పుజారా కలిసి జాగ్రత్తగా ఆడారు. తమ పదునైన బంతులతో ఆసీస్‌ పేసర్లు టీమిండియా ఓపెనర్లను కొంత ఇబ్బంది పెట్టారు. కమిన్స్‌ బౌలింగ్‌లో 5 పరుగుల వద్ద గిల్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మూడో స్లిప్‌లో లబ్‌షేన్‌ వదిలేశాడు. అయితే ఆ తర్వాత గిల్‌ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. ముఖ్యంగా స్టార్క్‌ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లు అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించాయి.

అవుటా... నాటౌటా!
ఆసీస్‌ కెప్టెన్‌ పైన్‌ రనౌట్‌ విషయంలో భారత్‌కు ప్రతికూల ఫలితం రావడం కొంత చర్చకు దారి తీసింది. అశ్విన్‌ బౌలింగ్‌లో గ్రీన్‌ షాట్‌ ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. కొంత సందిగ్ధంతో పైన్‌ అవతలి ఎండ్‌కు పరుగు తీయగా... అదే సమయంలో కవర్స్‌ నుంచి ఉమేశ్‌ విసిరిన త్రోను అందుకున్న పంత్‌ స్టంప్స్‌ను పడగొట్టాడు. దాంతో మూడో అంపైర్‌ను సంప్రదించాల్సి వచ్చింది. రీప్లేలలో పైన్‌ బ్యాట్‌ లైన్‌పైనే ఉన్నట్లు కనిపించింది. అలా చూస్తే అతను అవుట్‌. అయితే థర్డ్‌ అంపైర్‌ పాల్‌ విల్సన్‌ పదే పదే రీప్లేలు చూసిన అనంతరం నాటౌట్‌గా ప్రకటించారు. మరో కోణంలో బ్యాట్‌ కాస్త లోపలికి వచ్చినట్లు కనిపించడం కూడా అందుకు కారణం కావచ్చు. అయితే దీనిపై కెప్టెన్‌ రహానే అంపైర్‌ ముందు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది.

నువ్వా...నేనా!
మాథ్యూ వేడ్‌ క్యాచ్‌ను అందుకునే విషయంలో భారత ఫీల్డర్లు గిల్, జడేజా మధ్య సాగిన పోటీ కొంత ఉత్కంఠను రేపింది. అశ్విన్‌ బౌలింగ్‌లో వేడ్‌ కొట్టిన షాట్‌కు బంతి గాల్లోకి లేవగా మిడ్‌ వికెట్‌ నుంచి గిల్, మిడాన్‌ నుంచి జడేజా పరుగెత్తుకుంటూ వచ్చారు. బంతిపై మాత్రమే దృష్టి పెట్టిన వీరిద్దరు ఒకరిని మరొకరు చూసుకోలేదు. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత జడేజా ఆగమంటూ సైగ చేసినా గిల్‌ పట్టించుకోలేదు. చివరి క్షణంలో జడేజా కాస్త ఎత్తులోనే బంతిని అందుకొని పదిలం చేసుకోగా, గిల్‌ మాత్రం జారుతూ జడేజా సమీపంలోనే కింద పడ్డాడు. జడేజా ఏకాగ్రత, సరైన నియంత్రణ వల్ల ఇద్దరూ ఢీకొనలేదు గానీ లేదంటే ప్రమాదమే జరిగేది!

డీన్‌ జోన్స్‌కు నివాళి
మూడు నెలల క్రితం కన్నుమూసిన ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌ డీన్‌ జోన్స్‌కు అతని సొంత మైదానం ఎంసీజీలో రెండో టెస్టు సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు నివాళులు అర్పించారు. మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ తోడు రాగా... జోన్స్‌ భార్య, ఇద్దరు కూతుళ్లు మైదానంలోకి వచ్చి అతను ఉపయోగించిన బ్యాట్, బ్యాగీ గ్రీన్, సన్‌గ్లాసెస్‌ను వారు స్టంప్స్‌పై ఉంచారు. అనంతరం వాటిని బౌండరీ బయట సీట్‌పై పెట్టారు. జోన్స్‌ను గుర్తు చేసే విధంగా కొందరు ఆసీస్‌ క్రికెటర్లు తమ పెదవులపై అతనిలాగే జింక్‌ బామ్‌ పూసుకొని వచ్చారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాల్సిన రాడ్‌ టకర్‌...తన తల్లి మరణించడంతో చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఆక్సెన్‌ఫర్డ్‌ అంపైర్‌గా వచ్చారు. టకర్‌ తల్లికి నివాళిగా అంపైర్లు నలుపు రంగు బ్యాండ్‌లు ధరించారు.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; వేడ్‌ (సి) జడేజా (బి) అశ్విన్‌ 30; లబ్‌షేన్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 48; స్మిత్‌ (సి) పుజారా (బి) అశ్విన్‌ 0; హెడ్‌ (సి) రహానే (బి) బుమ్రా 38; గ్రీన్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 12; పైన్‌ (సి) విహారి (బి) అశ్విన్‌ 13; కమిన్స్‌ (సి) సిరాజ్‌ (బి) జడేజా 9; స్టార్క్‌ (సి) సిరాజ్‌ (బి) బుమ్రా 7; లయన్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 20; హాజల్‌వుడ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14;
మొత్తం (72.3 ఓవర్లలో ఆలౌట్‌) 195  
వికెట్ల పతనం: 1–10, 2–35, 3–38, 4–124, 5–134, 6–155, 7–155, 8–164, 9–191, 10–195.
బౌలింగ్‌: బుమ్రా 16–4–56–4, ఉమేశ్‌ యాదవ్‌ 12–2–39–0, అశ్విన్‌ 24–7–35–3, జడేజా 5.3–1–15–1, సిరాజ్‌ 15–4–40–2.  

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌  అగర్వాల్‌ (ఎల్బీ) (బి) స్టార్క్‌ 0; శుబ్‌మన్‌ గిల్‌ (బ్యాటింగ్‌) 28; పుజారా (బ్యాటింగ్‌) 7; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (11 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 36
వికెట్ల పతనం: 1–0.
బౌలింగ్‌: స్టార్క్‌ 4–2–14–1, కమిన్స్‌ 4–1–14–0, హాజల్‌వుడ్‌ 2–0–2–0, లయన్‌ 1–0–6–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top