మన బ్యాటర్లూ అదరగొట్టారు

India lead by 157 runs - Sakshi

స్మృతి, జెమీమా రోడ్రిగ్స్, రిచా, దీప్తి శర్మ అర్ధ సెంచరీలు

భారత్‌కు 157 పరుగుల ఆధిక్యం

ఆస్ట్రేలియా మహిళలతో ఏకైక టెస్టు   

ముంబై: ఆ్రస్టేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల హవా రెండో రోజూ కొనసాగింది. వాంఖెడే మైదానంలో తొలి రోజు పదునైన బౌలింగ్‌తో ఆసీస్‌ మహిళలను కట్టడి చేసిన మన జట్టు శుక్రవారం బ్యాటింగ్‌లోనూ చెలరేగి భారీ ఆధిక్యాన్ని అందుకుంది. మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 119 ఓవర్లలో 7 వికెట్లకు 376 పరుగులు చేసింది. దాంతో ప్రస్తుతానికి భారత్‌కు 157 పరుగుల ఆధిక్యం లభించింది.

స్మృతి మంధాన (106 బంతుల్లో 74; 12 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (121 బంతుల్లో 73; 9 ఫోర్లు), దీప్తి శర్మ (147 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు), రిచా ఘోష్‌ (104 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఆసీస్‌ బౌలర్లలో ఆఫ్‌ స్పిన్నర్‌ యాష్లీ గార్డ్‌నర్‌ 4 వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం క్రీజ్‌లో దీప్తితో పాటు పూజ వస్త్రకర్‌ (115 బంతుల్లో 33 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) ఉంది. వీరిద్దరు ఇప్పటికే ఎనిమిదో వికెట్‌కు అభేద్యంగా 102 పరుగులు జోడించడం విశేషం. శుక్రవారం ఆట మొత్తం 100 ఓవర్ల పాటు సాగగా, గార్డ్‌నర్‌ ఒక్కతే 36 ఓవర్లు వేసింది.  

స్మృతి రనౌట్‌... 
ఓవర్‌నైట్‌ స్కోరు 98/1తో భారత్‌ రెండో రోజు ఆట కొనసాగించింది. స్నేహ్‌ రాణా (9) ఎక్కువ సేపు నిలవలేకపోగా, 68 బంతుల్లో స్మృతి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆపై కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్మృతి స్వయంకృతంతో వెనుదిరిగింది. గార్డ్‌నర్‌ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడి సింగిల్‌కు ప్రయత్నించింది. అయిుతే రిచాతో సమన్వయలోపంతో పరుగు ఆలస్యం కావడంతో నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లో రనౌటైంది. అనంతరం రిచా, జెమీమా భాగస్వామ్యం భారత్‌ను మెరుగైన స్థితికి చేర్చింది. తొలి సెషన్‌లో భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులు జోడించింది.  

భారీ భాగస్వామ్యాలు... 
లంచ్‌ తర్వాత ఇన్నింగ్స్‌ 63వ ఓవర్లో గార్డ్‌నర్‌ బౌలింగ్‌లో రిచా కొట్టిన ఫోర్‌తో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.  జెమీమా 86 బంతుల్లో, కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న రిచా 98 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే రిచాను గార్త్‌ అవుట్‌ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. జెమీమా, రిచా నాలుగో వికెట్‌కు 113 పరుగులు జత చేశారు. అనంతరం చెలరేగిన గార్డ్‌నర్‌ తన వరుస ఓవర్లలో హర్మన్‌ప్రీత్‌ (0), యస్తిక (1)లను పెవిలియన్‌ను పంపడంతో పాటు కొద్ది సేపటికే జెమీమాకు కూడా అవుట్‌ చేసింది.

14 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో 274/7 వద్ద భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎంతో సేపు పట్టదనిపించింది. అయితే దీప్తి, పూజ భిన్నంగా ఆలోచించారు. చివరి సెషన్‌లో పట్టుదలగా నిలబడి పరుగులు సాధిస్తూ ఆసీస్‌ బౌలర్లను చికాకు పెట్టారు. దీప్తి తన బ్యాటింగ్‌ ప్రతిభను ప్రదర్శించగా... బౌలింగ్‌లో చెలరేగిన పూజ బ్యాటింగ్‌లోనూ మంచి డిఫెన్స్‌తో దీప్తికి అండగా నిలిచింది.

ఈ క్రమంలో 115 బంతుల్లో దీప్తి హాఫ్‌ సెంచరీని అందుకుంది. కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న దీప్తి ప్రతీ టెస్టులోనూ అర్ధసెంచరీ చేయడం విశేషం. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్‌ ఎనిమిది బౌలర్లతో ఎంతగా శ్రమించినా లాభం లేకపోయింది. 38 ఓవర్ల సెషన్‌లో భారత్‌ 100 పరుగులు సాధించగా, ఆసీస్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయింది.  

స్కోరు వివరాలు 
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: 219;
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: షఫాలీ (ఎల్బీ) (బి) జొనాసెన్‌ 40; స్మృతి (రనౌట్‌) 74; స్నేహ్‌ రాణా (బి) గార్డ్‌నర్‌ 9; రిచా (సి) గార్డ్‌నర్‌ (బి) గార్త్‌ 52; జెమీమా (సి) సదర్లాండ్‌ (బి) గార్డ్‌నర్‌ 73; హర్మన్‌ప్రీత్‌ (ఎల్బీ) (బి) గార్డ్‌నర్‌ 0; యస్తిక (ఎల్బీ) (బి) గార్డ్‌నర్‌ 1; దీప్తి శర్మ (బ్యాటింగ్‌) 70; పూజ (బ్యాటింగ్‌) 33; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (119 ఓవర్లలో 7 వికెట్లకు) 376. వికెట్ల పతనం: 1–90, 2–140, 3–147, 4–260, 5–261, 6–265, 7–274. బౌలింగ్‌: లౌరెన్‌ 9–3–23–0, గార్త్‌ 10–1–49–1, పెరీ 4–0–31–0, గార్డ్‌నర్‌ 41–7–100–4, జొనాసెన్‌ 18–4–42–1, సదర్లాండ్‌ 8–2–20–0, అలానా 19–1–69–0, తహీలా 10–2–22–0.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top