తొమ్మిదో స్థానంతో భారత్‌ ముగింపు... ‘షూటౌట్‌’లో అమెరికాపై విజయం | India finished ninth place | Sakshi
Sakshi News home page

తొమ్మిదో స్థానంతో భారత్‌ ముగింపు... ‘షూటౌట్‌’లో అమెరికాపై విజయం

Dec 11 2023 4:22 AM | Updated on Dec 11 2023 4:22 AM

India finished ninth place - Sakshi

జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో భారత జట్టుకు తొమ్మిదో స్థానం దక్కింది. చిలీ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో 9–10 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ ‘షూటౌట్‌’లో 3–2 గోల్స్‌ తేడాతో అమెరికా జట్టును ఓడించింది. నిvత 60 నిమిషాలు ముగిశాక భారత్, అమెరికా జట్లు 2–2తో సమంగా నిలిచాయి.

భారత్‌ తరఫున మంజు (11వ ని.లో), సునెలితా (57వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... అమెరికా జట్టుకు కిర్‌స్టెన్‌ థామసె (27వ, 53వ ని.లో) రెండు గోల్స్‌ అందించింది. ‘షూటౌట్‌’లో మొదటి ఐదు షాట్‌లు ముగిశాక కూడా రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున ముంతాజ్, రుతుజా గోల్స్‌ చేయగా... ప్రీతి, సాక్షి, అన్ను విఫలమయ్యారు.

అమెరికా జట్టు తరఫున అబిగెయిల్, లారెన్‌ వడాస్, అండర్‌వుడ్‌ కొట్టిన షాట్‌లను భారత గోల్‌కీపర్‌ మాధురి  నిలువరించగా... కేటీ డిక్సన్, ఒలివియా గోల్స్‌ చేశారు. ‘సడెన్‌డెత్‌’లో లారెన్‌ వడాస్‌ షాట్‌ను మాధురి అడ్డుకోగా... అనంతరం రుతుజా గోల్‌తో భారత విజయం ఖరారైంది.

Advertisement
 
Advertisement
Advertisement