IND vs ENG 3rd ODI: భారత్‌ తీన్‌మార్

India Beat England by 7 runs in 3rd ODI to Win Series 2-1 - Sakshi

వన్డే సిరీస్‌ కూడా టీమిండియా సొంతం

ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై 7 పరుగులతో కోహ్లి బృందం గెలుపు

మెరిసిన ధావన్, పంత్, హార్దిక్‌

బంతితో ఆకట్టుకున్న భువనేశ్వర్, శార్దుల్‌

స్యామ్‌ కరన్‌ పోరాటం వృథా  

సిరీస్‌ విజేతను తేల్చే ఆఖరి పోరులో భారత జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన చివరి వన్డేలో కోహ్లి బృందం ఏడు పరుగుల తేడాతో ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై నెగ్గింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను 3–1తో, టి20 సిరీస్‌ను 3–2తో దక్కించుకున్న టీమిండియా వన్డే ఫార్మాట్‌లోనూ పైచేయి సాధించి తమ సత్తా చాటుకుంది. 51 రోజులపాటు సాగిన ఈ సుదీర్ఘ పర్యటనలో పలుమార్లు ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఇంగ్లండ్‌ కీలక సమయాల్లో భారత్‌ దూకుడు ముందు తడబడి మూడు ఫార్మాట్‌లలోనూ సిరీస్‌లను సమర్పించుకొని తిరుగుముఖం పట్టింది.   

పుణే: ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన నిర్ణాయక సమరంలో భారత్‌ ఒత్తిడిని జయించి విజయాన్ని హస్తగతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో తమ సత్తా చాటుకుంది. ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఏడు పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున 200వ మ్యాచ్‌లో కెప్టెన్సీ చేసిన కోహ్లి మరోసారి టాస్‌ ఓడిపోయాడు. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తాత్కాలిక కెప్టెన్‌ బట్లర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 48.2 ఓవర్లలో 329 పరుగులవద్ద ఆలౌటైంది.

ధావన్‌ (56 బంతుల్లో 67; 10 ఫోర్లు), పంత్‌ (62 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన ఆటతో అర్ధ సెంచరీలు సాధించారు. రోహిత్‌ శర్మ (37 బంతుల్లో 37; 6 ఫోర్లు), శార్దుల్‌ ఠాకూర్‌ (21 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించారు. అనంతరం 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసి ఓడిపోయింది.

మలాన్‌ (50 బంతుల్లో 50; 6 ఫోర్లు), స్టోక్స్‌ (39 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్‌), లివింగ్‌స్టోన్‌ (31 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించినా కీలక తరుణంలో అవుట్‌ అయ్యారు. అయితే స్యామ్‌ కరన్‌ (83 బంతుల్లో 95 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) పట్టుదలతో ఆడి ఎనిమిదో వికెట్‌కు ఆదిల్‌ రషీద్‌ (22 బంతుల్లో 19; 2 ఫోర్లు)తో 57 పరుగులు... తొమ్మిదో వికెట్‌కు మార్క్‌ వుడ్‌ (21 బంతుల్లో 14; ఫోర్‌)తో 60 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు.

భారత్‌కు సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని తీవ్రంగా శ్రమించి మ్యాచ్‌ ఆఖరి బంతికి అందుకునేలా చేశాడు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్‌ నెగ్గినా... స్యామ్‌ కరన్‌ తన అసాధారణ పోరాటం తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌ విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. భారత బౌలర్‌ నటరాజన్‌ నేర్పుతో బౌలింగ్‌ చేసి స్యామ్‌ కరన్‌ను కట్టడి చేసి కేవలం ఆరు పరుగులిచ్చి టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. భారత బౌలర్లు భువనేశ్వర్‌ (3/42), శార్దుల్‌ (4/67) కీలక వికెట్లు తీశారు. స్యామ్‌ కరన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... బెయిర్‌స్టోకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.  


శతక భాగస్వామ్యం...
భారత ఇన్నింగ్స్‌లో ధావన్, రోహిత్‌ తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. మెయిన్‌ అలీ బౌలింగ్‌లో రోహిత్‌ బౌల్డ్‌ కావడం... ఆ తర్వాత ధావన్, కోహ్లి (7), కేఎల్‌ రాహుల్‌ (7) వెంటవెంటనే అవుటవ్వడంతో భారత్‌ 157 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే పంత్‌–హార్దిక్‌ ఐదో వికెట్‌కు 99 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. పంత్, హార్దిక్‌ అవుటయ్యాక కృనాల్‌తో కలిసి శార్దుల్‌ ఠాకూర్‌ 45 పరుగులు జత చేయడంతో భారత స్కోరు 300 దాటింది. అయితే ఒక్కసారిగా భారత ఇన్నింగ్స్‌ కుప్పకూలింది. 8 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయి పూర్తి 50 ఓవర్లు ఆడకుండానే భారత్‌ 329 పరుగులవద్ద ఆలౌటైంది.  

సూపర్‌ భువనేశ్వర్‌...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఈసారి శుభారంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న జేసన్‌ రాయ్, బెయిర్‌స్టోలను భువనేశ్వర్‌ అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ తడబడింది. ఆ తర్వాత స్టోక్స్, మలాన్, బట్లర్, లివింగ్‌స్టోన్, మొయిన్‌ అలీ క్రీజులో నిలదొక్కుకుంటున్న క్రమంలో అవుట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 200 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదలు కుంది. కానీ స్యామ్‌ కరన్‌ అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను ఆఖరి ఓవర్‌ వరకు తెచ్చినా ఇంగ్లండ్‌ను విజయతీరానికి చేర్చలేకపోయాడు.   

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) రషీద్‌ 37; ధావన్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 67; కోహ్లి (బి) అలీ 7; పంత్‌ (సి) బట్లర్‌ (బి) స్యామ్‌ కరన్‌ 78; రాహుల్‌ (సి) అలీ (బి) లివింగ్‌స్టోన్‌ 7; హార్దిక్‌ (బి) స్టోక్స్‌ 64; కృనాల్‌ (సి) రాయ్‌ (బి) వుడ్‌ 25; శార్దుల్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 30; భువనేశ్వర్‌ (సి) స్యామ్‌ కరన్‌ (బి) టాప్లీ 3; ప్రసిధ్‌ కృష్ణ (బి) వుడ్‌ 0; నటరాజన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్‌) 329

వికెట్ల పతనం: 1–103, 2–117, 3–121, 4–157, 5–256, 6–276, 7–321, 8–328, 9–329, 10–329.

బౌలింగ్‌: స్యామ్‌ కరన్‌ 5–0–43–1; టాప్లీ 9.2–0–66–1;  వుడ్‌ 7–1– 34–3; స్టోక్స్‌ 7–0–45–1; రషీద్‌ 10–0–81–2;  అలీ 7–0–39–1; లివింగ్‌స్టోన్‌ 3–0–20–1.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (బి) భువనేశ్వర్‌ 14; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్‌ 1; స్టోక్స్‌ (సి) ధావన్‌ (బి) నటరాజన్‌ 35; మలాన్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) శార్దుల్‌ 50; బట్లర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్‌ 15; లివింగ్‌స్టోన్‌ (సి అండ్‌ బి) శార్దుల్‌  36; మొయిన్‌ అలీ (సి) హార్దిక్‌ (బి) భువనేశ్వర్‌ 29; స్యామ్‌ కరన్‌ (నాటౌట్‌) 95;  రషీద్‌ (సి) కోహ్లి (బి) శార్దుల్‌ 19; వుడ్‌ (రనౌట్‌) 14; టాప్లీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 322

వికెట్ల పతనం: 1–14, 2–28, 3–68, 4–95, 5–155, 6–168, 7–200, 8–257, 9–317.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10–0–42–3; నటరాజన్‌ 10–0–73–1; ప్రసిధ్‌ కృష్ణ 7–0–62–0; శార్దుల్‌ ఠాకూర్‌ 10–0–67–4; హార్దిక్‌ పాండ్యా 9–0–48–0; కృనాల్‌ పాండ్యా 4–0–29–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top