‘హైదరాబాద్‌లో ఖేల్‌ ఖతం.. ఆఖరి మ్యాచ్‌లో అతడిని ఆడించండి’ | IND vs WI T20Is Let Vaibhav Suryavanshi play last one: Former India Star | Sakshi
Sakshi News home page

‘హైదరాబాద్‌లో ఖేల్‌ ఖతం.. ఆఖరి మ్యాచ్‌లో అతడిని ఆడించండి’

Oct 12 2026 1:49 PM | Updated on Oct 12 2026 1:53 PM

IND vs WI T20Is Let Vaibhav Suryavanshi play last one: Former India Star

టీమిండియా (PC: BCCI X)

టీమిండియా- వెస్టిండీస్‌ మధ్య టీ20 సిరీస్‌ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందగా.. పరుగుల వరద పారిన రెండో టీ20లో విండీస్‌ ఏకంగా 250 పరుగుల లక్ష్యాన్ని మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఊదేసింది.

ఇక ఆదివారం ఇండోర్‌లో జరిగిన మూడో టీ20 కూడా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. భారత్‌ విధించిన 224 పరుగుల లక్ష్యానికి చేరువగా వచ్చే ప్రయత్నం చేసిన కరేబియన్‌ జట్టు.. పద్నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ సేన ఊపిరి పీల్చుకుంది.

2-1తో ఆధిక్యంలో టీమిండియా
తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది టీమిండియా. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. హైదరాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా.. 2-2తో సమం చేయాలని విండీస్‌ పట్టుదలగా ఉన్నాయి.

సంజూ నిలకడలేని ఆట
ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఓపెనింగ్‌ జోడీని మారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా విండీస్‌తో ఈ సిరీస్‌లో ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో ఓపెనర్లలో అభిషేక్‌ శర్మ 21, 20, 69 పరుగులు చేయగా.. సంజూ శాంసన్‌ 11, 82, 3 పరుగులు సాధించాడు.

గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న సంజూ రెండో టీ20లో 82 పరుగులు చేసి టచ్‌లోకి వచ్చినా.. ఇండోర్‌ మ్యాచ్‌లో మళ్లీ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సంజూకు బదులు.. యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీని ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

అయితే, వెస్టిండీస్‌తో సిరీస్‌ మొత్తంలో సంజూనే ఆడిస్తామని హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. కాబట్టి వైభవ్‌ బెంచ్‌కే పరిమితం కాక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హైదరాబాద్‌లో ఖేల్‌ ఖతం.. ఆఖరి మ్యాచ్‌లో అతడిని ఆడించండి
స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ మ్యాచ్‌లో గెలిచేసి టీమిండియా 3-1తో సిరీస్‌ సొంతం చేసుకోవాలి. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో వైభవ్‌ సూర్యవంశీని ఆడించాలి. 

నాలుగో మ్యాచ్‌తోనే సిరీస్‌ను చుట్టేసి.. సూర్యవంశీని చివరి మ్యాచ్‌లో ఆడించడం అన్నింటికంటే మెరుగ్గా ఉంటుంది’’ అని అభిషేక్‌ నాయర్‌ అన్నాడు. 

కాగా పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటికి టీమిండియా తరఫున ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడి 246 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక టీమిండియా- వెస్టిండీస్‌ మధ్య ఐదో టీ20కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక.

చదవండి: యువీ డకౌట్‌.. బంగ్లాదేశ్‌ చేతిలో ఇండియా చాంపియన్స్‌ ఓటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement