Photo Credit: Twitter
‘ప్రొఫెషనల్ క్రికెటర్‌గా భారత్ తరఫున ఆడుతున్నప్పుడు నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తించాలి. అందుకోసం అవసరమైన సన్నద్ధత, ప్రాక్టీస్, శిక్షణ.. నా చేతుల్లో ఉన్న ప్రతిదీ చేస్తాను. కానీ ఈ ఫార్మాట్‌లో ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. అందుకే వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యానని చెప్పి.. తర్వాతి ఇన్నింగ్స్‌లో నెమ్మదిగా ఆడి ఫామ్ అందుకోవాలని అనుకోలేం. నేను పరుగులు చేయలేకపోతే ఆ బాధ్యత నాదే. అందుకు మరెవరినీ నిందించను. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ పరుగులు చేయడమే నా పని. దాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను’.. వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా సంజూ సామ్సన్ చేసిన వ్యాఖ్యలివి.
కట్‌చేస్తే.. మూడో టీ20లో శాంసన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో సంజూ సామ్సన్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ వచ్చిన వెంటనే మరుసటి మ్యాచ్‌లో తుస్సుమనిపించడం అతడికి అలవాటుగా మారిపోయింది.
వెస్టిండీస్‌తో రెండో టీ20లో 82 పరుగులు చేసిన సందర్భంలో సామ్సన్ మాట్లాడిన మాటలను తాజాగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ‘‘బ్యాటింగ్‌లో విఫలమైతే బాధ్యత నాదే అని డైలాగులు చెప్పడం కాదు గురూ.. ఆ బాధ్యతను ఇప్పుడు తీసుకుంటావా? ఇలాగే ఆడుతూ పోతే జట్టులో చోటు కోల్పోవడం ఖాయం’’ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
2026 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంజూ సామ్సన్.. అదే బ్రాండ్‌నేమ్‌తో ఇప్పటివరకు జట్టులో కొనసాగుతూనే వస్తున్నాడు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ సంజూకు తుది జట్టులో అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి. తాను ఆడిన గత 11 ఇన్నింగ్స్‌ల్లో సంజూ సామ్సన్ వరుసగా 1, 27, 10, 57, 50, 9, 7, 2, 11, 82, 3 పరుగులు చేశాడు.
ఈ అంకెలు చూస్తుంటే అతడిలో స్థిరత్వం లోపించిదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అసలే ఎప్పుడెప్పుడు జట్టులోకి వచ్చేద్దామా అని చకోర పక్షిలా ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి స్థిరత్వలేమి ఇన్నింగ్స్‌లతో సంజూనే అతడి రాకకు బాటలు వేస్తున్నాడనిపిస్తోంది. సామ్సన్ ఆటతీరు ఇలాగే కొనసాగితే మాత్రం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ అతడికి ఆఖరి సిరీస్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా జరగకూడదనుకుంటే సంజూ సామ్సన్ ఇప్పటినుంచైనా బాధ్యతగా ఆడాల్సిన అవసరముంది.
ఇదీ చదవండి:


