యువీ డకౌట్‌.. బంగ్లాదేశ్‌ చేతిలో ఇండియా చాంపియన్స్‌ ఓటమి | WCL 2026 Yuvraj Singh Fails Bangladesh Beat India Champions By 3 Runs | Sakshi
Sakshi News home page

యువీ డకౌట్‌.. బంగ్లాదేశ్‌ చేతిలో ఇండియా చాంపియన్స్‌ ఓటమి

Oct 12 2026 12:36 PM | Updated on Oct 12 2026 12:43 PM

WCL 2026 Yuvraj Singh Fails Bangladesh Beat India Champions By 3 Runs

బంగ్లాదేశ్‌ చేతిలో ఇండియా చాంపియన్స్‌ ఓటమి (PC: WCL X)

ఇండియా చాంపియన్స్‌ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. అనూహ్య రీతిలో బంగ్లాదేశ్‌ చాంపియన్స్‌ చేతిలో మూడు పరుగుల స్వల్ప తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (WCL)-2026లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్‌- బంగ్లాదేశ్‌ చాంపియన్స్‌ తలపడ్డాయి.

141 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌
షార్జా క్రికెట్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన ఇండియా చాంపియన్స్‌​ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ చాంపియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్లలో ఇమ్రుల్‌ కాయేస్‌ (10) విఫలమైనా.. రోనీ తాలూక్‌దార్‌ (25 బంతుల్లో 40) రాణించాడు.

పీయూశ్‌ చావ్లాకు మూడు వికెట్లు
మిగిలిన వారిలో నాసిర్‌ హుసేన్‌ (21 బంతుల్లో 24), అరాఫత్‌ సన్నీ (38 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పీయూశ్‌ చావ్లా మూడు వికెట్లు పడగొట్టగా.. రిషీ ధావన్‌, పవన్‌ నేగి చెరో రెండు.. మోహిత్‌ శర్మ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

రాయుడు విఫలం.. యువీ డకౌట్‌
ఇక బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా చాంపియన్స్‌కు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లలో అంబటి రాయుడు (5 బంతుల్లో 3) పూర్తిగా విఫలం కాగా.. ఇర్ఫాన్‌ పఠాన్‌ (41 బంతుల్లో 24) నిరాశపరిచాడు. 

వన్‌డౌన్‌లో వచ్చిన స్టువర్ట్‌ బిన్నీ (7 బంతుల్లో 15) వేగంగా ఆడే ప్రయత్నంలో అవుట్‌ కాగా.. కెప్టెన్‌, పవర్‌ హిట్టర్‌ యువరాజ్‌ సింగ్‌ (4 బంతుల్లో 0) డకౌట్‌ అయ్యాడు.

మూడు పరుగుల స్వల్ప తేడాతో 
మిగిలిన వారిలో యూసఫ్‌ పఠాన్‌ (4) తేలిపోగా.. అభిమన్యు మిథున్‌ డకౌట్‌ అయ్యాడు. రాబిన్‌ ఊతప్ప (6 బంతుల్లో 15), రిషీ ధావన్‌ (18 బంతుల్లో 24), పవన్‌ నేగి (14 బంతుల్లో 26 నాటౌట్‌) కాసేపు పోరాడారు. ఆఖర్లో పీయూశ్‌ చావ్లా (18 బంతుల్లో 24 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా చాంపియన్స్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులే చేయగా.. బంగ్లాదేశ్‌ చాంపియన్స్‌ మూడు పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కి జయభేరి మోగించింది. బంగ్లా బౌలర్లలో ఇనాముల్‌ హక్‌ జూనియర్‌ మూడు ఓవర్లలో కేవలం పన్నెండు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చి..భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌, రిషీ ధావన్‌, అభిమన్యు మిథున్‌ వికెట్లు తీసి సత్తా చాటాడు. మిగిలిన వారిలో అబూ జాయేద్‌ రెండు వికెట్లు తీయగా.. రూబెల్‌ హొసేన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఇక కమ్రుల్‌ ఇస్లాం యువరాజ్‌ రూపంలో కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.

ఇప్పటికి ఒకే ఒక్కటి గెలిచిన యువీ సేన
కాగా డబ్ల్యూసీఎల్‌-2026 టోర్నీలో ఇండియా చాంపియన్స్‌ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక్కటి గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ లీగ్‌లో ఇండియాతో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ పాల్గొంటున్నాయి. 

మరోవైపు.. పాకిస్తాన్‌ మాత్రం టోర్నీ ఆరంభానికి ముందే తప్పుకొంది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక టీమిండియాను ఓడించి గెలుపు ఖాతా తెరిచిన బంగ్లాదేశ్‌ చిట్టచివరన ఆరో స్థానంలో ఉంది. 

చదవండి: IND vs WI: ‘అతడిని అడ్డుకున్నాడు.. ఆ పాపం కెప్టెన్‌దే’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement