Shikar Dhawan: మా ఓటమికి కారణం అదే

IND Vs SL: Shikar Dhawan Reveals About Losing Match To Sri Lanka 3rd ODI - Sakshi

కొలంబో: శ్రీలంకతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు విజయాలతో జోరు మీద కనిపించిన టీమిండియా మూడో వన్డేకు భారీ మార్పులతో బరిలోకి దిగింది. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు వన్డే డెబ్యూ ఇచ్చారు. కాగా భారత్ జట్టు ఓటమిపై మ్యాచ్ తర్వాత శిఖర్ ధావన్ మాట్లాడుతూ ‘‘మ్యాచ్‌లో మాకు మెరుగైన ఆరంభం లభించింది. కానీ.. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు చేజార్చుకున్నాం. దాంతో.. చివరికి ఆశించిన దానికంటే ఓ 50 పరుగులు తక్కువగా చేశాం. వన్డే సిరీస్ అప్పటికే దక్కడంతో.. కొత్త ఆటగాళ్లకి అవకాశం ఇచ్చాం. కానీ.. మేము ఆశించిన విధంగా ఫలితం రాలేదు. తప్పిదాల్ని దిద్దుకుని.. టీ20 సిరీస్‌లో సత్తాచాటుతాం’’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా ఆదివారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సొంతగడ్డపై భారత్‌ చేతిలో 10 మ్యాచ్‌ల పరాజయాల పరంపరకు తెరదించుతూ ఎట్టకేలకు శ్రీలంక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్‌ సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత భారత్‌ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ పృథ్వీ షా (49 బంతుల్లో 49; 8 ఫోర్లు), అరంగేట్రం చేసిన సంజూ సామ్సన్‌ (46 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 40; 7 ఫోర్లు) రాణించారు. అకిల ధనంజయ, ప్రవీణ్‌ జయవిక్రమ చెరో మూడు వికెట్లు సాధించి భారత్‌ను తక్కువ స్కోరుకే కట్డడి చేశారు. ఛేజింగ్‌లో శ్రీలంక 39 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవిష్క ఫెర్నాండో (98 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్‌), భానుక రాజపక్స (56 బంతుల్లో 65; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టుకు గెలుపు బాటలు వేశారు. సూర్యకుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top