PC: BCCI X
శ్రీలంక పర్యటనను టీమిండియా ఘనంగా ఆరంభించింది. గాలె వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఇరుజట్ల మధ్య ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక.
అతడి గురించే నా ఆందోళన
ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘నేను ఓ ఆటగాడి గురించి బాగా ఆందోళన చెందుతున్నా. అతడు మరెవరో కాదు కుల్దీప్ యాదవ్.
పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేశాడు?
శ్రీలంకతో రెండో టెస్టులో అతడు ఆడకపోవచ్చు. తన చేతికి బంతిని ఇస్తున్నారు. కానీ లాంగ్ స్పెల్స్‌కు అవకాశం ఇవ్వడం లేదు. నిజానికి తొలి టెస్టులో బ్యాటర్, పార్ట్ టైమ్ స్పిన్నర్ దేవదత్ పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేయాల్సి వచ్చింది?
ఎందుకంటే.. జట్టులో సరైన ఆఫ్ స్పిన్నర్ లేడు. కాబట్టి రెండో టెస్టులో టీమిండియా.. కుల్దీప్ యాదవ్‌ను తప్పించి ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌కు పిలుపునివ్వవచ్చు. ఇద్దరు లెఫ్టాండర్ బ్యాటర్లు క్రీజులో ఉన్నపుడు ఆఫ్ స్పిన్నర్‌ను రంగంలోకి దింపితే ప్రయోజనకరంగా ఉంటుంది.
సారాంశ్ అరంగేట్రం పక్కా
కాబట్టి కుల్దీప్ యాదవ్‌ను కాదని యాజమాన్యం సారాంశ్ జైన్ వైపు మొగ్గుచూపుతుందనిపిస్తోంది. కొలంబోలో సారాంశ్ అరంగేట్రం దాదాపు ఖాయమైపోయినట్లే’’ అని పేర్కొన్నాడు. ఈ ఒక్కటి తప్ప తుదిజట్టులో మార్పులు ఉండబోవని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
కాగా గాలెలో జరిగిన తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో 14 ఓవర్ల బౌలింగ్‌లో 65 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు.. పడిక్కల్ లంక రెండో ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ వేసి.. ఐదు పరుగులు ఇచ్చాడు.
కుల్దీప్ యాదవ్‌కే రహానే మద్దతు
ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే మాత్రం కైఫ్‌తో విభేదించాడు. ‘‘కొలంబోలో కూడా గాలె మాదిరి పిచ్ ఉంటే.. నేను కుల్దీప్ యాదవ్‌నే ఆడించాలని చెప్తాను. అతడు అత్యద్భుతమైన నైపుణ్యాలున్న బౌలర్. మ్యాచ్ విన్నర్ కూడా. సరైన సమయంలో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది.
చాన్నాళ్ల తర్వాత అతడిని తుదిజట్టులోకి తీసుకున్నారు. మరొక్క అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రహానే పేర్కొన్నాడు. కాగా గాలె టెస్టులో టీమిండియా ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వీరిలో కుల్దీప్ స్పెషలిస్టు స్పిన్నర్ కాగా.. జడేజా, మానవ్ ఆల్‌రౌండర్లు.
గాలె టెస్టులో ఆడిన భారత తుదిజట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.


