Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్‌ శర్మ

Ind Vs Sl 2nd Test: Rohit Sharma Praises Bumrah  Shreyas Ashwin - Sakshi

Ind Vs Sl 2nd Test- Rohit Sharma Comments: ‘విజయపరంపర బాగుంది. వ్యక్తిగతంగా, జట్టుగా కూడా నేను వీటిని ఆస్వాదిస్తున్నాను.  జట్టులోని సీనియర్‌ సభ్యులు కూడా కెప్టెన్సీ బాధ్యతల్లో సహకరించారు. జడేజా, అయ్యర్, పంత్, అశ్విన్‌...ఇలా అందరూ సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎక్కడైనా, ఎలాంటి స్థితిలోనైనా బౌలింగ్‌ చేయగల బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కొత్త స్థానంలో బ్యాటింగ్‌ను సవాల్‌గా తీసుకొని విహారి ఆడాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడం లక్ష్యమే అయినా దాని గురించి ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేం. దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది. అయితే ఇప్పటి వరకు జట్టుగా మేం చాలా సాధించాం’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.

కాగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో భారత్‌ గెలుపు పరిపూర్ణమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. తద్వారా రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత స్వదేశంలో ప్రత్యర్థి జట్ల వైట్‌వాష్‌ల సంఖ్య పెరిగింది. వెస్టిండీస్‌తో మూడేసి చొప్పున టి20, వన్డేలు... తర్వాత శ్రీలంకతో మూడు టి20 పోటీలు, ఇప్పుడు రెండు సంప్రదాయ టెస్టులు అన్నింటా రోహిత్‌ సేనదే విజయం.

ఈ నేపథ్యంలో బెంగళూరు పింక్‌టెస్టు విజయానంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా జరిగిన శ్రీలంక సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం సంతోషాన్నిచ్చిందని, అయితే.. సౌతాఫ్రికా పర్యటనలో చేదు అనుభవాల కారణంగా అవకాశాలకు గండిపడిందని పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో విరాట్‌ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. రోహిత్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు.

ఇండియా వర్సెస్‌ శ్రీలంక రెండో టెస్టు స్కోర్లు:
ఇండియా తొలి ఇన్నింగ్స్‌- 252 ఆలౌట్‌
రెండో ఇన్నింగ్స్‌- 303/9 డిక్లేర్డ్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌- 109 ఆలౌట్‌ 
రెండో ఇన్నింగ్స్‌- 208 ఆలౌట్‌ 
238 పరుగులతో భారత్‌ భారీ విజయం

చదవండి: IND VS SL 2nd Test: కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top