శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా.. ఘన విజయం | IND vs SL 1st Test Day 5: India Beat Sri Lanka By 165 Runs | Sakshi
Sakshi News home page

శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా.. ఘన విజయం

Aug 19 2026 1:20 PM | Updated on Aug 19 2026 2:03 PM

IND vs SL 1st Test Day 5: India Beat Sri Lanka By 165 Runs

PC: BCCI X

శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. గాలెలో 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 206 పరుగులకే ఆలౌట్‌ కావడంతో టీమిండియాకు భారీ విజయం సాధ్యమైంది. యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ ఆరు వికెట్లు తీసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

ఈ గెలుపుతో టీమిండియా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 ఫైనల్‌ రేసులో కీలక ముందడుగు వేసింది. కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గాలె స్టేడియంలో శనివారం తొలి టెస్టు మొదలైంది.

పడిక్కల్‌ సెంచరీతో..
టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ భారీ శతకం (167)తో చెలరేగగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది.

అయితే, రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్‌ పంత్‌ హాఫ్‌ సెంచరీ (66)తో రాణించగా.. భారత్‌ 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో... తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

ధనంజయ, దినుష పోరాటం
ఈ నేపథ్యంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్లు నిశాన్‌ మధుష్క (6), లాహిరు ఉదార (16)తో పాటు.. అనూహ్య రీతిలో అరంగేట్రం చేసిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ పసిందు సూరియబండారా (0) పూర్తిగా విఫలమయ్యాడు.

సీనియర్‌ బ్యాటర్‌ కమిందు మెండిస్‌ (2) కూడా చేతులెత్తేశాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్‌ ధనంజయ డి సిల్వ, తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో సొనాల్‌ దినుష పట్టుదలగా నిలబడ్డారు. బుధవారం నాటి ఐదో రోజు ఆటలో హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకుని భారత బౌలర్ల సహనాన్ని వీరిద్దరు పరీక్షించారు.

జడ్డూ మ్యాజిక్‌
ఈ క్రమంలో రవీంద్ర జడేజా ధనంజయ డి సిల్వ (59)ను అవుట్‌ చేసి బ్రేక్‌ ఇవ్వగా.. ప్రసిద్‌ కృష్ణ నిరోషన్‌ డిక్‌వెల్లా (10)ను అవుట్‌ చేశాడు. దీంతో భోజన విరామ సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

ఆరేసిన మానవ్‌ సుతార్‌
అయితే, లంచ్‌ తర్వాత కూడా సొనాల్‌ దినుష పట్టువీడకుండా క్రీజులో పాతుకుపోయాడు. సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ మానవ్‌ సుతార్‌ అతడికి ఊహించని షాకిచ్చాడు. 76వ ఓవర్లో తొలి బంతిని లెగ్‌ స్టంప్‌ అవుట్‌సైడ్‌ దిశగా సంధించగా.. షాట్‌ ఆడే క్రమంలో దినుష (84) విఫలమయ్యాడు. ఈ క్రమంలో ధ్రువ్‌ జురెల్‌ క్యాచ్‌ అందుకోగా.. టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి.

ఇక ఆ తర్వాత మరుసటి బంతికే మానవ్‌ సుతార్‌ ప్రభాత్‌ జయసూర్య (0)ను బౌల్డ్‌ చేశాడు. తర్వాతి ఓవర్లో లాహిరు కుమార (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.  ఇక 78వ ఓవర్లో నాలుగో బంతికి కేశారా నువాంత (20)ను కూడా బౌల్డ్‌ చేసిన మానవ్‌ సుతార్‌ తన ఆరో వికెట్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో మానవ్‌ సుతార్‌ నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ మ్యాచ్‌లో మొత్తంగా పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌. ఇదిలా ఉంటే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో దేవదత్‌ పడిక్కల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

శ్రీలంక వర్సెస్‌ భారత్‌ తొలి టెస్టు
👉వేదిక: గాలె ఇంటర్నేషనల్‌ స్టేడియం, గాలె.
👉టాస్‌: టీమిండియా.. బ్యాటింగ్‌
సంక్షిప్త స్కోర్లు
👉భారత్‌: 462 &193
👉శ్రీలంక: 284 &206
👉ఫలితం: శ్రీలంకపై 165 పరుగుల తేడాతో భారత్‌ జయభేరి
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: దేవదత్‌ పడిక్కల్‌ (167 & 44).

చదవండి: వివాదంలో రింకూ సింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement