
Ind Vs Sa: రాహుల్ కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు; నేను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు!
Virat Kohli Press Conference: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమైన నేపథ్యంలో కేఎల్ రాహుల్ అతడి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, మొట్టమొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించిన రాహుల్‌కు ఈ మ్యాచ్ చేదు అనుభవమే మిగిల్చింది. భారత్‌కు లక్కీ గ్రౌండ్‌గా పేరున్న వాండరర్స్‌లో పరాజయమే ఎదురైంది. దీంతో ప్రొటిస్ జట్టు 1-1తో సిరీస్‌ను సమం చేసింది. జనవరి 11 నుంచి ఆరంభమయ్యే మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. రాహుల్ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ వికెట్లు తీసేందుకు(బౌలర్ల వ్యూహాలు అమలు చేసేందుకు) ఎంతగానో ప్రయత్నించాడు. కానీ సౌతాఫ్రికా అద్బుతంగా ఆడింది. కాబట్టి అతడు అక్కడ కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఒకవేళ నేను గనుక అక్కడ ఉంటే ఇంకా ఏదైనా వ్యూహాన్ని అమలు చేసేవాడినేమో. అయినా... ఒక్కొక్కరి కెప్టెన్సీ ఒక్కోలా ఉంటుంది’’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఇక తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని, కేప్‌టౌన్ టెస్టుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
అదే విధంగా... తన ఫామ్‌లేమిపై వస్తున్న విమర్శలపై కోహ్లి స్పందిస్తూ... ‘‘నాకు ఇదేమీ కొత్త కాదు. చాలా రోజులుగా ఈ మాటలు వింటునే ఉన్నా. అలాంటి సమయంలో నేను నెలకొల్పిన రికార్డుల గురించి గుర్తుచేసుకుంటా. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రతిసారి శాయశక్తులను ఒడ్డుతాను. అంతేగానీ.. బయట నా గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోను. అయినా నేను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు’’ అని కోహ్లి పేర్కొన్నాడు.
చదవండి: Virat Kohli Press Meet: పంత్ గుణపాఠాలు నేర్చుకుంటాడు.. ఇక రహానే, పుజారా..