Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్‌ చేతికి బంతి.. ఈ క్రెడిట్‌ మొత్తం వాళ్లదే!

Ind Vs Ire: Hardik Pandya Credits Bowlers After 4 Runs Win Lauds Umran - Sakshi

India Vs Ireland 2nd T20- Hardik Pandya Comments: ‘‘ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుత పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అన్న విషయంపై మాత్రమే దృష్టి సారించాను. ఉమ్రాన్‌పై నమ్మకం ఉంచాను. అతడి బౌలింగ్‌లో పేస్‌ ఉంది. మరి ప్రత్యర్థి 18 పరుగులు సాధించడం అంటే కాస్త కష్టమే కదా!’’ అంటూ ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా.. కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ను కొనియాడాడు.

రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ నిమిత్తం ఐర్లాండ్‌కు వెళ్లిన టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసి ఆతిథ్య జట్టుకు నిరాశను మిగిల్చింది. మొదటి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన పాండ్యా సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 

ఉమ్రాన్‌ చేతికి బంతి
ముఖ్యంగా ఐర్లాండ్‌ బ్యాటర్లు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి లక్ష్యం వైపు పయనించినా.. భారత బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఓటమి తప్పలేదు. నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బంతిని పాండ్యా.. ఉమ్రాన్‌ మాలిక్‌కు ఇచ్చాడు. ఆరు బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన తరుణంలో ఐర్లాండ్‌ బ్యాటర్లు మార్క్‌ అడేర్‌, డాక్‌రెల్‌ క్రీజులో ఉన్నారు.

జోరు మీదున్న ఈ ఇద్దరు బ్యాటర్లకు.. స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ తన వేగంతో వారికి చెమటలు పట్టించాడు. అయితే, రెండో బంతికే నోబాల్‌ వేయడంతో ఐర్లాండ్‌ శిబిరంలో ఆశలు చిగురించినా ఆ తర్వాత ఉమ్రాన్‌ తన పేస్‌తో కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో 12 పరుగులకే పరిమితమైన బల్బిర్నీ బృందం నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. భారత జట్టు ఊపిరి పీల్చుకుంది.

వాళ్లు అద్భుతమైన షాట్లు ఆడారు..
ఈ విజయంపై స్పందించిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘నిజంగా వాళ్లు(ఐర్లాండ్‌ బ్యాటర్లు) అద్భుతమైన షాట్లు ఆడారు. అయితే, ఈ విజయం క్రెడిట్‌ మొత్తం మా బౌలర్లకే దక్కుతుంది’’ అని పేర్కొన్నాడు. ప్రేక్షకుల నుంచి కూడా తమకు మద్దతు లభించిందని, అందుకు ప్రతిగా వారికి కావాల్సినంత వినోదం పంచామని చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్‌ మాలిక్‌, సెంచరీ వీరుడు ఉమ్రాన్‌ మాలిక్‌ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు పాండ్యా వెల్లడించాడు. 
  
మొదటి సిరీస్‌లోనే ఇలా: పాండ్యా భావోద్వేగం
తమను సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి పాండ్యా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఇక దేశానికి ఆడాలన్న చిన్ననాటి కల నెరవేరడం ఒక ఎత్తైతే.. జట్టుకు సారథ్యం వహించిన మొదటి సిరీస్‌లోనే విజయం సాధించడం తన కెరీర్‌లో మరింత ప్రత్యేకమైనదంటూ పాండ్యా ఉద్వేగానికి లోనయ్యాడు. 

ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌ రెండో టీ20:
టాస్‌: ఇండియా- బ్యాటింగ్‌
ఇండియా స్కోరు: 225/7 (20)
ఐర్లాండ్‌ స్కోరు:  221/5 (20)
విజేత: నాలుగు పరుగుల తేడాతో ఇండియా విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: దీపక్‌ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు)
చదవండి: Deepak Hooda: దీపక్‌ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top