IND Vs IRE T20I Highlights: ఉత్కంఠపోరులో టీమిండియా విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

India Beat Ireland By 4 Runs 2nd T20I Clinch Series Victory 2-0 - Sakshi

రెండో టి20లో 4 పరుగులతో భారత్‌ గెలుపు

2–0తో ఐర్లాండ్‌పై సిరీస్‌ విజయం 

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి 2–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్‌ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, సంజు సామ్సన్‌ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సత్తా చాటాడు. అనంతరం ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఆండీ బల్బర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), పాల్‌ స్టిర్లింగ్‌ (18 బంతుల్లో 40; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హ్యారీ టెక్టర్‌ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు), డాక్‌రెల్‌ (16 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.  

రికార్డు భాగస్వామ్యం... 
87 బంతుల్లో 176 పరుగులు... భారత జట్టు తరఫున టి20ల్లో అత్యధిక పరుగుల కొత్త రికార్డు భాగస్వామ్యమిది! హుడా, సామ్సన్‌ కలిసి జోడించిన ఈ పరుగులే భారత్‌ భారీ స్కోరుకు కారణమయ్యాయి. ఇషాన్‌ కిషన్‌ (3) వెనుదిరిగిన తర్వాత జత కలిసిన వీరిద్దరు ఐర్లాండ్‌ బౌలర్లపై చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 54 పరుగులకు చేరింది. డెలానీ ఓవర్లో వరుస బంతుల్లో సామ్సన్‌ 4, 6 కొట్టగా, మెక్‌బ్రైన్‌ ఓవర్లో హుడా రెండు సిక్సర్లు బాది 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆల్ఫర్ట్‌ ఓవర్లోనూ హుడా 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టగా... 31 బంతుల్లో సామ్సన్‌ తన కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు.

ఆ తర్వాతా హుడా, సామ్సన్‌ జోరు కొనసాగింది. డెలానీ ఓవర్లో సామ్సన్‌ మళ్లీ వరుస బంతుల్లో రెండు సిక్సర్లతో దూకుడును ప్రదర్శించాడు. ఎట్టకేలకు సామ్సన్‌ను బౌల్డ్‌ చేసి ఎడైర్‌ ఈ భారీ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. లిటిల్‌ ఓవర్లో పాయింట్‌ దిశగా సింగిల్‌ తీసి హుడా 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో చివరి 3 ఓవర్లలో భారత్‌ 5 వికెట్లు కోల్పోయి 24 పరుగులే చేయగలిగింది.  

ఆరంభం అదిరినా... 
భారీ ఛేదనను ఐర్లాండ్‌ దూకుడుగా ఆరంభించింది. భువీ వేసిన తొలి ఓవర్లో స్టిర్లింగ్‌ వరుసగా 6, 4, 4, 4 బాదగా, 5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 65. అయితే తర్వాతి ఓవర్లో స్టిర్లింగ్‌ను బిష్ణోయ్‌ బౌల్డ్‌ చేయగా, డెలానీ (0) రనౌటయ్యాడు. మరో ఎండ్‌లో సిక్సర్లతో చెలరేగిన బల్బర్నీ 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. జోరు మీదున్న 
బల్బర్నీని హర్షల్‌ అవుట్‌ చేయడంతో ఐర్లాండ్‌ వేగానికి బ్రేకులు పడ్డాయి. చివర్లో డాక్‌రెల్‌ పోరాడినా లాభం లేకపోయింది.

చదవండి: దీపక్‌ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top