Kohli Breaks Sachin Record: ప్రపంచ రికార్డు నెలకొల్పిన కోహ్లి.. సచిన్‌ రికార్డు బద్దలు 

IND Vs ENG 4th Test Day 1: Virat Kohli Breaks Sachin Record, Fastest Batsmen To Reach 23000 International Runs - Sakshi

ఓవల్‌: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని క్రాస్‌ చేశాడు. అండర్సన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన రన్‌ మెషీన్‌ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్​లో వేగంగా 23,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్​మెన్​గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. సచిన్‌.. 522 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకోగా, కోహ్లి 440 మ్యాచ్‌ల్లో 490 ఇన్నింగ్స్‌లలో 55.28 సగటుతో ఈ మైలరాయిని క్రాస్‌ చేశాడు. ఇందులో 70 శతకాలు, 116 అర్ధ శతకాలు బాదాడు. 

ఇక ఫీట్‌ను పూర్తి చేయడానికి ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికి పాంటింగ్‌కు 544 ఇన్నింగ్స్ అవసరం కాగా, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌ 551 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. వీరి తర్వాత శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(568 ఇన్నింగ్స్‌), ద వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌(576), శ్రీలం​క మాజీ కెప్టెన్‌ జయవర్ధనే(645) వరుసగా ఈ మార్కును క్రాస్‌ చేశారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ తొలి రోజు లంచ్‌ విరామం సమయానికి టీమిండియా 54 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. 

రోహిత్‌ శర్మ(11), కేఎల్‌ రాహుల్‌(17), పుజారా(4) పెవిలియన్‌ బాట పట్టగా విరాట్‌ కోహ్లి(18), రవీంద్ర జడేజా(2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ పేసర్లు క్రిస్‌ వోక్స్‌, ఓలీ రాబిన్సన్‌, ఆండర్సన్‌ తలో వికెట్‌ పడగొట్టి టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు. అంతకుముందు ఇంగ్లీష్ కెప్టెన్‌ జో రూట్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఇరు జ‌ట్లు రెండు మార్పులతో బరిలోకి దిగాయి. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జోస్ బ‌ట్ల‌ర్‌, సామ్ కర్రన్‌ల స్థానంలో ఓలీ పోప్‌, క్రిస్ వోక్స్ బరిలోకి దిగగా, టీమిండియా ప్లేయర్స్‌ ఇషాంత్ శ‌ర్మ‌, మహ్మద్ ష‌మీల స్థానాల్లో శార్దూల్ ఠాకూర్‌, ఉమేశ్ యాద‌వ్‌లు జ‌ట్టులోకి వచ్చారు. 
చదవండి: 'స్టన్నింగ్‌ క్యాచ్‌తో మా గుండెల్ని గెలుచుకున్నావు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top