IND Vs ENG: పుజారా క్లాస్‌ ప్లేయర్‌ అయితే సూర్యకుమార్‌ మ్యాచ్‌ విన్నర్‌.. మూడో టెస్ట్‌ ఆడించండి

IND Vs ENG 3rd Test: Bring Suryakumar Yadav In The Place Of Pujara, Suggests Farokh Engineer - Sakshi

ముంబై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హెడింగ్లే వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌ కోసం టీమిండియాలో ఓ కీలక మార్పు చేయాలని భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ డిమాండ్‌ చేశాడు. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న టీమిండియా నయా వాల్‌ పుజారాను తప్పించి, డాషింగ్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ప్రస్తుత ఇంగ్లండ్‌ పర్యటనలో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 70 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచిన పుజారా స్థానంలో సూర్యకుమార్‌ను తుది జట్టులో ఆడిస్తే భారత విజయావకావాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డాడు. 

పుజారా నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తూ భారత టాప్‌ ఆర్డర్‌పై ఒత్తిడి తెస్తున్నాడని, అతని స్థానంలో వేగంగా పరుగులు చేయగల సూర్యను ఆడిస్తే టపార్డర్‌పై భారం తగ్గుతుందని పేర్కొన్నాడు. పుజారా సహా రహానే కూడా ప్రస్తుతం ఫామ్‌ లేమితో సతమవుతున్నారని, ఆడిన మ్యాచ్‌ల్లో కూడా నిదానంగా పరుగులు చేస్తూ జట్టుకు నిరుపయోగంగా మారారని విమర్శించాడు. పుజారా, రహానే క్లాస్‌ ప్లేయర్లే అయ్యిండొచ్చు కానీ, సూర్యకుమార్‌ ఓ  మ్యాచ్‌ విన్నర్‌ అని ఆకాశానికెత్తాడు. సూర్యకుమార్‌ వేగంగా పరుగులు సాధించడంతో పాటు మిడిలార్డర్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పగల సమర్ధుడని కితాబునిచ్చాడు. అందుకే పుజారా, రహానేల్లో ఒకరిపై వేటు వేసి సూర్యకుమార్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశాడు. 

కాగా, ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకుని.. ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఇంగ్లండ్‌లోని భారత్ జట్టుతో చేరారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుబట్టి మరీ పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను ఇంగ్లండ్‌కి పిలిపించాడు. అయితే, లార్డ్స్ టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దాంతో పృథ్వీ షా మూడో టెస్టులో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే పుజారా స్లో ఇన్నింగ్స్‌లపై గుర్రుగా ఉన్న టీమిండియా మేనేజ్‌మెంట్‌.. సూర్యకుమార్ యాదవ్‌కి టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మొదటి టెస్ట్ డ్రాగా ముగియగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 1-0తో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
చదవండి:  ఫవాద్ ఆలామ్ అజేయ శతకం.. పటిష్ట స్థితిలో పాక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top