లార్డ్స్‌ టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం

IND Vs ENG: 2nd Test Day 5 Updates And Highlights - Sakshi

లార్డ్స్‌లో మూడో విజయం
టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో విజయం సాధించి లార్డ్స్‌ మైదానంలో మూడో విజయాన్ని నమోదు చేసింది. 1986, 2014 తర్వాత లార్డ్స్‌ మైదానంలో భారత్‌ మూడో విజయం సాధించింది. దీంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో సిరాజ్‌ 4, ఇషాంత్‌ 3, షమీకి 2 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. స్కోర్ల వివరాలు: భారత్‌: 364 & 298/8 డిక్లెర్డ్‌, ఇంగ్లండ్‌: 391& 120.

సిరాజ్‌ ఆన్‌ ఫైర్‌.. వరుస బంతుల్లో వికెట్లు తీసిన హైదరాబాదీ బౌలర్‌
టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చెలరేగిపోయాడు. వరుస బంతుల్లో ప్రమాదకరమైన మొయిన్‌ అలీ, సామ్‌ కర్రన్‌ల వికెట్లు తీసి ఇంగ్లండ్‌ ఓటమిని దాదాపు ఖరారు చేశాడు. కర్రన్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిరాజ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్‌ గెలవాలంటే 21.4 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో బట్లర్‌(8), రాబిన్సన్‌(0) ఉన్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. మొయిన్‌ అలీ(13) ఔట్‌
జడేజా వేసిన అంతకుముందు ఓవర్లో నాలుగు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మొయిన్‌ అలీ(13) ఎట్టకేలకు సిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లి చేతికి చిక్కాడు. దీంతో 90 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ జట్టు ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్‌ గెలవాలంటే 21.5 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో బట్లర్‌(8), సామ్‌ కర్రన్‌(0) ఉన్నారు.

ఇంగ్లండ్‌ ఓటమి లాంచనమే.. డేంజరస్‌ బ్యాట్స్‌మెన్‌ రూట్‌(33) ఔట్‌
క్రీజ్‌లో పాతుకుపోయి ప్రమాదకారిగా మారిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌(33; 5 ఫోర్లు)ను.. బుమ్రా బోల్తా కొట్టించాడు. ఫస్ట్‌ స్లిప్‌లో కోహ్లి అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో రూట్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 67 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని దాదాపుగా ఖారారు చేసుకుంది. క్రీజ్‌లో మొయిన్‌ అలీ, జోస్‌ బట్లర్‌ ఉన్నారు. ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. 

చెలరేగుతున్న ఇషాంత్‌.. ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ చెలరేగి బౌలింగ్‌ చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇదివరకే హసీబ్‌ హమీద్‌ను పెవిలియన్‌కు పంపిన లంబూ.. డేంజర్‌ బ్యాట్స్‌మెన్‌ బెయిర్‌స్టోను(2)కూడా ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మరోవైపు కెప్టెన్‌ జో రూట్‌(33) క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇరు జట్టు టీ బ్రేక్‌ తీసుకున్నాయి. 

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. హమీద్‌(9) ఔట్‌
ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోన్న ఇంగ్లండ్‌ జట్టుకు మరో షాక్‌ తగిలింది. వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ హసీబ్‌ హమీద్‌(9)ను ఇషాంత్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 44 పరుగులకే ఇంగ్లండ్‌ జట్టు మూడు వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. క్రీజ్‌లో రూట్‌(21), బెయిర్‌స్టో(0) ఉన్నారు. ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 228 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి.

టీమిండియా పేసర్ల విశ్వరూపం.. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌
టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ జట్టు కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టీమిండియా పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్‌ రోరి బర్న్స్ ను డకౌట్‌ చేయగా, రెండో ఓవర్‌లో షమీ మరో ఓపెనర్‌ సిబ్లీని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్‌ జట్టు ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. క్రీజ్‌లో కెప్టెన్‌ జో రూట్‌, హసీబ్‌ హమీద్‌ ఉన్నారు. 

టీమిండియా 298/8 డిక్లేర్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 272
లంచ్‌ విరామం తర్వాత బరిలోకి దిగిన టీమిండియా.. మరో 12 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మహ్మద్‌ షమీ(70 బంతుల్లో 56; 5 ఫోర్లు, సిక్స్‌), బుమ్రా(64 బంతుల్లో 34; 3 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు. మొత్తం 109.3 ఓవర్లు ఆడిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి, ప్రత్యర్ధికి 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

అర్ధ సెంచరీతో అదరగొట్టిన షమీ.. 259 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
టీమిండియా బౌలర్లు మహ్మద్‌ షమీ(67 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌), బుమ్రా(58 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 209 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌(ఇషాంత్‌ (16)) కోల్పోయాక వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ.. తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 77 పరుగులు జోడించారు. ముఖ్యంగా షమీ ఇంగ్లండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కెరీర్‌లో రెండో హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. లంచ్‌ విరామం సమయానికి టీమిండియా స్కోర్‌ 286/8. ప్రస్తుతం భారత్‌ 259 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. ఇషాంత్‌(12) ఔట్‌
ఇంగ్లండ్‌ పేసర్‌ రాబిన్సన్‌.. ఆఖరి రోజు ఆటలో టీమిండియాను మరో దెబ్బకొట్టాడు. తొలుత కీలకమైన పంత్‌ వికెట్‌ పడగొట్టిన రాబిన్సన్‌.. క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఇషాంత్‌(16; 2 ఫోర్లు)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. 90 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 211/8.  ప్రస్తుతం టీమిండియా 184 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో షమీ(7), బుమ్రా(0) ఉన్నారు. 

లండన్‌: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిన భారత్‌.. ఆఖరి రోజు ఆట ఆరంభం కాగానే కీలకమైన రిషభ్‌ పంత్‌ (46 బంతుల్లో 22; ఫోర్‌) వికెట్‌ను కోల్పోయింది. పంత్‌ తన ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో ఎనిమిది పరుగులు మాత్రమే జోడించి రాబిన్సన్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 86 ఓవర్ల తర్వాత టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 167 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో ఇషాంత్‌ శర్మ (8), షమీ(0) ఉన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top