IND VS BAN 1st Test: దిగ్గజ బ్యాటర్‌ను అధిగమించిన పుజారా.. నెక్స్ట్‌ టార్గెట్‌ కోహ్లినే 

IND VS BAN 1st Test: Pujara Surpasses Dilip Vengsarkar - Sakshi

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా.. భారత దిగ్గజ బ్యాటర్‌ దిలీప్‌ వెంగసర్కార్‌ రికార్డును అధిగమించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి ఔటైన పుజారా.. టీమిండియా తరఫున అత్యధిక టెస్ట్‌ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెంగ్‌సర్కార్‌ను వెనక్కునెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. వెంగ్‌సర్కార్‌ 116 టెస్ట్‌ల్లో 6868 పరుగులు చేయగా..పుజారా 97 టెస్ట్‌ల్లో 6882 పరుగులు సాధించాడు.

ఈ జాబితాలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ (15921 పరుగులు) అగ్రస్థానం‍లో ఉండగా.. రాహుల్‌ ద్రవిడ్‌ (13265), సునీల్‌ గవాస్కర్‌ (10122), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (8781), వీరేంద్ర సెహ్వాగ్‌ (8503), విరాట్‌ కోహ్లి (8075), సౌరవ్‌ గంగూలీ (7212) పుజారా కంటే ముందున్నారు.

ప్రస్తుతం క్రికెట్‌ ఆడతున్న ఆటగాళ్లలో కోహ్లి మాత్రమే పుజారా కంటే ముందున్నాడు. 97 టెస్ట్‌లు ఆడిన పుజారా.. 44.11 సగటున 18 సెంచరీలు, 34 అర్థ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో రోహిత్‌ శర్మ (3137) మాత్రమే పుజారాకు కాస్త దగ్గరగా ఉన్నాడు. 

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. చతేశ్వర్‌ పుజారా (90), శ్రేయస్‌ అయ్యర్‌ (82 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీలతో ఆదుకున్నారు.

రిషబ్‌ పంత్‌ (46) పర్వాలేదనిపించాడు. 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, శ్రేయస్‌ 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. కేఎల్‌ రాహుల్‌ (22), శుభ్‌మన్‌ గిల్‌ (20), విరాట్‌ కోహ్లి (1) నిర్శాపరిచారు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్‌ పటేల్‌ (14) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్‌ 2, ఖలీద్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top