Ind Vs Aus: ఓపెనర్‌గా కోహ్లి! రోహిత్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి!

Ind Vs Aus: Danish Kaneria On Rohit Batting Position Consider Drops No 3 - Sakshi

India Vs Australia T20 Series- Rohit Sharma: టీ20లలో టీమిండియా ఓపెనింగ్‌ జోడీ గురించి పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసి.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని సూచించాడు. ఇటీవలి కాలంలో రోహిత్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడని.. శుభారంభం లభించినా ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడని పెదవి విరిచాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారితే ఆట తీరులో మార్పు రావచ్చేమోనని పేర్కొన్నాడు.

ఆసియా కప్‌ టోర్నీలో..
కాగా ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీలో టీమిండియా సారథి, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఈ మెగా ఈవెంట్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి అతడు సాధించిన మొత్తం పరుగులు 133. సూపర్‌-4లో శ్రీలంకతో మ్యాచ్‌లో 72 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. మిగతా మ్యాచ్‌లలో నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు.

ఇక ఆస్ట్రేలియాతో స్వదేశంలో తొలి టీ20లోనూ రోహిత్‌ బ్యాట్‌ ఝులిపించలేకపోయాడు. మొహాలీలో ఆసీస్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌.. తొమ్మిది బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో డానిష్‌ కనేరియా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. రోహిత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

కోహ్లిని ఓపెనర్‌గా పంపితే..
ఈ మేరకు.. ‘‘రోహిత్‌ శర్మ ఇటీవలి కాలంలో పెద్దగా పరుగులు రాబట్టలేకపోతున్నాడు. ఆసియా కప్‌లోనూ తన ప్రదర్శన స్థాయికి తగినట్లు లేదు. ఆరంభం బాగానే ఉన్నా.. భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. రోహిత్‌ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మూడో స్థానానికి మార్చుకోవాలి. లేదంటే.. కేఎల్‌ రాహుల్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలి. అప్పుడు విరాట్‌ కోహ్లి- రోహిత్‌ ఓపెనర్లుగా వస్తారు’’ అని డానిష్‌ కనేరియా చెప్పుకొచ్చాడు. 

కాగా ఆసియా కప్‌- 2022లో విరాట్‌ కోహ్లి 276 పరుగులతో టీమిండియా తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఆసీస్‌తో మొదటి టీ20లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఏడు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నాథన్‌ ఎలిస్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైన టీమిండియా సిరీస్‌ను పరాజయంతో ఆరంభించింది.

చదవండి: ఉప్పల్‌లో భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌.. హెచ్‌సీఏకు క్రీడామంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top