IND VS AUS 4t​h Test Day 4: సువర్ణావకాశాలను చేజార్చుకున్న భారత్‌

IND VS AUS 4th Test Day 4: Kuhnemann Dropped Twice In Start Of Second Innings - Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ఆట చివరి రోజైన రేపు (మార్యి 13) భారత బౌలర్లు ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసి, ఆ తర్వాత నిర్ధేశించబడిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించగలిగితే సిరీస్‌తో (3-1) పాటు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు కూడా భారత్‌ వశమవుతుంది.

నాలుగో రోజు చివర్లో టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదాల కారణంగా, ఆసీస్‌పై  ఇవాల్టి నుంచే పట్టుబిగించే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు తాత్కాలిక ఓపెనర్‌ మాథ్యూ కుహ్నేమన్‌ (0) ఇచ్చిన క్యాచ్‌లను తొలుత కేఎస్‌ భరత్‌, ఆతర్వాత పుజారా జారవిడిచారు. ఒకవేళ ఈ రెండు అవకాశాల్లో భారత్‌కు ఒక్క వికెట్‌ లభించినా ఆసీస్‌ను పూర్తిగా ఒత్తిడిలోని నెట్టే అవకాశం ఉండేది.

అందులోనే ఆ జట్టు రెగ్యులర్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఈ సమీకరణలన్నీ భారత్‌కు కలిసొచ్చి ఉండేవి. భరత్‌, పుజారాలు ఏమాత్రం​ అప్రమత్తంగా వ్యవహరించి ఉండినా పరిస్థితి వేరేలా ఉండేది. భారత్‌కు గెలుపుపై ధీమా పెరిగేది. ఇప్పటికైన మించిపోయిందేమీ లేదు. ఆఖరి రోజు తొలి బంతిని నుంచి ప్రత్యర్ధిపై ఒత్తిడి తేగలిగితే, టీమిండియా గెలుపుకు ఢోకా ఉండదు.

ఆసీస్‌ను 150 పరుగుల లోపు ఆలౌట్‌ చేసి, ఆతర్వాత 60, 70 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం టీమిండియాకు అంత కష్టం కాకపోవచ్చు. అయితే ఇదంతా సాధ్యపడాలంటే భారత స్పిన్నర్లు రేపు తొలి బంతి నుంచే చెలరేగాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇది అంత ఈజీ కూడా కాకపోవచ్చు.

కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్‌ హెడ్‌ (3), మాథ్యూ కుహ్నేమన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. 

అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి (186)తో పాటు శుభ్‌మన్‌ గిల్‌ (128) సెం‍చరీ చేయగా..  అక్షర్‌ పటేల్‌ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. 

ఉస్మాన్‌ ఖ్వాజా (180), గ్రీన్‌ (114) సెంచరీలతో కదం‍తొక్కగా.. అశ్విన్‌ 6 వికెట్లతో ఆసీస్‌ వెన్ను విరిచాడు. ఆసీస్‌ బౌలర్లలో లియోన్‌, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, కుహ్నేమన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.  

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top