BGT 2023: ఇదెక్కడి పిచ్‌ రా బాబు.. మరీ ఇంత దారుణమా..?

IND VS AUS 3rd Test: Matthew Hayden Slams Indore Pitch Live On Air - Sakshi

Matthew Hayden: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో పర్యాటక ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్‌ (5/16) టీమిండియా బ్యాటింగ్‌  లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్‌ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (9), ఉస్మాన్‌ ఖ్వాజా (60), లబూషేన్‌ (31), స్టీవ్‌ స్మిత్‌ (26) ఔట్‌ కాగా.. హ్యాండ్స్‌కోంబ్‌ (7), గ్రీన్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్‌ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

కాగా, ఊహకందని విధంగా మెలికలు తిరుగుతూ, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న హోల్కర్‌ మైదానం పిచ్‌పై ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మ్యాచ్‌ జరుగుతుండగానే లైవ్‌లో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇదెక్కడి పిచ్‌ రా బాబు.. మరీ ఇంత దారుణంగా టర్న్‌ అవుతుందని ధ్వజమెత్తాడు. ఈ పిచ్‌ జనరేట్‌ చేస్తున్న టర్న్‌ చూస్తే భయమేస్తుందని అన్న హేడెన్‌.. స్పిన్నింగ్‌ కండీషన్స్‌ను తూర్పారబెట్టాడు.

టెస్ట్‌ క్రికెట్‌లో తొలి రోజు ఆరో ఓవర్‌లోనే స్పిన్‌ బౌలర్‌ తన ప్రతాపం చూపితే.. మ్యాచ్‌ ఎన్ని గంటల పాటు సాగుతుందని ప్రశ్నించాడు. ఇలాంటి పిచ్‌లకు తన మద్దతు ఎప్పుడూ ఉండదని అసహనం వ్యక్తం చేశాడు. టెస్ట్‌ మ్యాచ్‌లకు పిచ్‌లను తొలి రెండు రోజులు బ్యాటర్లకు అనుకూలించేలా తయారు చేయాలని సూచించాడు. తొలి రోజు భారత బ్యాటింగ్‌ సందర్భంగా కామెంటరీ బాక్స్‌లో ఉన్న హేడెన్‌ ఈ వ్యాఖ్యలు చేయగా.. పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి రెండే రెం‍డు ముక్కల్లో "హోమ్‌ కండీషన్స్‌" అంటూ హేడెన్‌ కామెంట్స్‌ను బదులిచ్చాడు.

కొద్ది సేపు ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్‌ చేయని శాస్త్రి.. ఆతర్వాత మైక్‌ పట్టుకుని, ఇది హోమ్‌ కండీషన్స్‌ కంటే చాలా అధికంగా ఉందని, మున్ముందు మ్యాచ్‌ మరింత టఫ్‌గా మారుతుందని జోస్యం చెప్పాడు. అయితే ఒక్క మంచి భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పుతుందని అభిప్రాయపడ్డాడు. 

ఇదిలా ఉంటే, 4 మ్యాచ్‌ల బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్‌ల్లో టీమిండియా రెండింటిలోనూ విజయాలు సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఎలాగైనా గెలిచి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉండిన రోహిత్‌ సేనకు తొలి రోజు పిచ్‌ వ్యవహరించిన తీరు మింగుడుపడని విషయంగా మారింది.          

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top