IND vs AUS 3rd Test Day 2: హెడ్‌, స్మిత్‌ సెంచరీలు.. ఆసీస్‌ భారీ స్కోరు | Ind vs Aus 3rd Test Day 2 Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs AUS 3rd Test Day 2: హెడ్‌, స్మిత్‌ సెంచరీలు.. ఆసీస్‌ భారీ స్కోరు

Dec 15 2024 7:00 AM | Updated on Dec 15 2024 1:30 PM

Ind vs Aus 3rd Test Day 2 Live Updates And Highlights

Ind vs Aus 3rd Test Day 2 Summary: బ్రిస్బేన్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రెండో రోజు ముగిసింది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 28/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆదివారం నాటి ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ టీమిండియాపై పైచేయి సాధించింది. ఆరంభంలో ఆకట్టుకున్న భారత పేసర్లు ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

అంతా తలకిందులు
ట్రవిస్‌ రాకతో అంతా తలకిందులైంది. ఆసీస్‌ స్కోరు 75/3 వద్ద ఉన్న సమయంలో స్టీవ్‌ స్మిత్‌తో కలిసిన హెడ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు. 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు .. మొత్తంగా 152 పరుగులు సాధించాడు. మరోవైపు.. స్మిత్‌ సైతం శతకం(101)తో మెరిశాడు.

ఈ జంటను జస్‌‍ప్రీత్‌ బుమ్రా అవుట్‌ చేయడంతో టీమిండియా కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే, అలెక్స్‌ క్యారీ(47 బంతుల్లో 45*) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా ఆసీస్‌ నాలుగు వందల పరుగుల మార్కు దాటింది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 101 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసి.. పటిష్ట స్థితిలో నిలిచింది. భారత బౌలర్లలో పేసర్లు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మహ్మద్‌ సిరాజ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

Updates
ఏడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
భారత పేసర్‌ సిరాజ్‌కు ఎట్టకేలకు వికెట్‌ దక్కింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 98వ ఓవర్‌ వేసిన సిరాజ్‌ బౌలింగ్‌లో కమిన్స్‌ వికెట్‌ కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆసీస్‌ ఏడో వికెట్‌ కోల్పోగా.. సిరాజ్‌కు ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌ దక్కింది. మిచెల్‌ స్టార్క్‌ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్‌ స్కోరు: 387-7(98). 

96 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 377/6.
96 ఓవర్లకు ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్‌ కమ్మిన్స్‌(17), అలెక్స్‌ క్యారీ(33) ఉన్నారు. 96 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 377/6.

ఆసీస్‌ ఆరో వికెట్‌ డౌన్‌..
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ ఎట్టకేలకు ఔటయ్యాడు. జస్ప్రీత్‌ బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. హెడ్‌ 152 బంతుల్లో 18 ఫోర్లతో 152 పరుగులు చేసి ఔటయ్యాడు. 88 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 330/6
ఆసీస్‌ ఐదో వికెట్‌ డౌన్‌..
ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌(5).. విరాట్‌ ​కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
బుమ్రా బౌలింగ్‌లో స్మిత్‌ అవుటయ్యాడు.  శతకం పూర్తి చేసుకున్న ఈ వెటరన్‌ బ్యాటర్‌ 101 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.  మిచెల్‌ మార్ష్‌ క్రీజులోకి వచ్చాడు. హెడ్‌ 149 పరుగులతో ఆడుతున్నాడు. ఆసీస్‌ స్కోరు: 318/4 (84)

స్మిత్‌ సెంచరీ..
ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స్మిత్‌ ప్రస్తుతం 100 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. స్మిత్‌కు ఇది 33వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. భారత్‌పై ఇది స్మిత్‌కు 10వ టెస్టు సెంచరీ. 82 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 313/3

టీ బ్రేక్‌ సమయానికి ఆసీస్‌ స్కోరు: 234/3 (70).
హెడ్‌ 103, స్మిత్‌ 65 పరుగులతో ఆడుతున్నారు

ట్రావిస్‌ హెడ్‌ సూపర్‌ సెంచరీ..
బ్రిస్బేన్‌ టెస్టులో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ సూపర్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 115 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను హెడ్‌ అందుకున్నాడు. హెడ్‌కు ఇది తొమ్మిదవ టెస్టు సెంచరీ. భారత్‌పై మూడో టెస్టు సెంచరీ. ప్రస్తుతం 101 పరుగులతో హెడ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 69 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 231/3.

స్మిత్‌ హాఫ్‌ సెంచరీ..
ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. బ్రిస్బేన్‌ టెస్టులో స్మిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. స్మిత్‌ 50 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 64 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 196/3.

హెడ్‌ హాఫ్‌ సెంచరీ.. 
గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 52 పరుగులతో హెడ్‌ బ్యాటిం‍గ్‌ చేస్తున్నాడు. 56 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 158/3. క్రీజులో హెడ్‌తో పాటు స్మిత్‌(44) ఉన్నాడు.

భారత్‌కు మరోసారి హెడ్‌ 'ఎక్‌'
ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. స్టార్‌ బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ మరోసారి భారత్‌కు తలనొప్పిగా మారాడు. లబుషేన్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెడ్‌ తనదైన స్టైల్లో ఆడుతున్నాడు. అతడితో పాటు స్టీవ్‌ స్మిత్‌ క్రీజులో పాతుకుపోయారు. 50 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.   ప్రస్తుతం క్రీజులో హెడ్‌(36), స్మిత్‌(35) ఉన్నారు.

లంచ్‌ బ్రేక్‌కు ఆసీస్‌ స్కోర్‌: 104/3
రెండో రోజు లంచ్ బ్రేక్ స‌మ‌యానికి ఆస్ట్రేలియా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్‌(20), స్టీవ్ స్మిత్‌(25) ప‌రుగుల‌తో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా..
లబుషేన్‌ ఔటైన అనంతరం ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 42 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్‌(24), ట్రావిస్‌ హెడ్‌(17) ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..
75 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మార్నస్‌ లబుషేన్‌.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్లిప్‌లో విరాట్‌ కోహ్లి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. క్రీజులోకి ట్రావిస్‌ హెడ్‌ వచ్చాడు. 34 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 75/3

నిలకడగా ఆడుతున్న ఆసీస్‌..
ఆస్ట్రేలియా బ్యాటర్లు మార్నస్‌ లబుషేన్‌, స్మిత్‌ నిలకడగా ఆడుతున్నారు. 27 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్‌(10), లబుషేన్‌(8) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. 
మెక్‌స్వీనీ రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయిది. 9 పరుగులు చేసిన మెక్‌స్వీనీ.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి స్మిత్‌ వచ్చాడు. 19 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 39/2

బుమ్‌ బుమ్‌ బుమ్రా..
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ తమ మొదటి వికెట్‌ కోల్పోయింది. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖావాజా(21) వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి మార్నస్‌ లబుషేన్‌ వచ్చాడు.

రెండో రోజు ఆట ప్రారంభం..
బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్‌ అటాక్‌ను ఆకాష్‌ దీప్‌ ఆరంభించాడు. కాగా తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 13. 2 ఓవర్లలో ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

తుదిజట్లు
టీమిండియా
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్‌ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

ఆస్ట్రేలియా
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement