ఇకపై 20 జట్లతో టీ20 ప్రపంచకప్‌, 14 జట్లతో వన్డే వరల్డ్‌కప్‌

ICC Approves 14 Team For ODI World Cup In Next FTP - Sakshi

దుబాయి: 2023-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్​టూర్స్ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రకటించింది. బోర్డు మెంబర్లతో మంగళవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహాలోనే టీ20 ప్రపంచ కప్‌ రెండేళ్లకోసారి నిర్వహించాలని, అయితే అందులో​16 జట్లకు బదులు 20 జట్లను ఆడించాలని నిర్ణయించింది. అలాగే 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్‌ టోర్నీని 10 జట్లకు బదులు 14 జట్లతో జరిపించాలని, ప్రస్తుతం రెండేళ్లకోసారి జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీని, నాలుగేళ్లకోసారి జరపాలని ప్రకటించింది.

2019లో చివరిసారిగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో 10 పది జట్లు మాత్రమే పాల్గొనగా, 2027, 2031 ప్రపంచకప్‌లలో ఆ సంఖ‍్య 14కు పెంచాలని, మొత్తం మ్యాచ్‌ల సంఖ్యను 54కు మార్చాలని ఐసీసీ నిర్ణయించింది. వన్డే ప్రపంచ కప్‌ ఫార్మాట్‌లో 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించి,  ప్రతి గ్రూప్‌లో టాప్-3 జట్లను సూపర్ సిక్స్‌గా పరిగణించి, ఆతర్వాత సెమీస్, ఫైనల్స్​నిర్వహిస్తారని ప్రకటించింది. ఐసీసీ.. 2003 ప్రపంచకప్‌లో ఇదే పద్ధతిని అనుసరించింది. 

అలాగే 2024, 2026, 2028, 2030లలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లను 20 జట్లతో నిర్వహించి, మొత్తం మ్యాచ్‌ల సంఖ్యని 55కి పెంచనున్నట్లు పేర్కొంది. టీ20 ప్రపంచ కప్‌ ఫార్మాట్‌లో 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌లో టాప్‌-2 జట్లను సూపర్‌-8గా పరిగణించి, ఆతర్వాత నాకౌట్, సెమీస్, ఫైనల్స్‌ను​నిర్వహిస్తారని తెలిపింది. వీటితో పాటు ఎనిమిది జట్లతో నిర్వహించే ఛాంపియన్స్​ట్రోఫీని ప్రతి నాలుగేళ్లకోసారి (2025, 2029), ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌ను రెండేళ్లకోసారి (2025, 2027, 2029, 2031) నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఛాంపియన్స్​ట్రోఫీని గతంలో లాగే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఆతర్వాత సెమీస్, ఫైనల్స్ నిర్వహిస్తారని పేర్కొంది.
చదవండి: శ‌వాల‌తో రోడ్లపై క్యూ క‌ట్టడం చూశాక నిద్రపట్టేది కాదు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top