
భారత కెప్టెన్‌కు ఐసీసీ సూచన
నేడు బీసీసీఐ ఫిర్యాదుపై విచారణ
దుబాయ్: ప్రస్తుతం ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఏకపక్షంగా జరుగుతున్నాయి. కానీ ఆరోపణలు, ఫిర్యాదులే పోటాపోటీగా సాగుతున్నాయి. ‘షేక్‌హ్యాండ్’ తిరస్కరణపై సలసల ఉడికిపోతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంకో అడుగు ముందుకేసి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. లీగ్ దశలో పాక్‌పై గెలుపు అనంతరం విజయాన్ని పహల్గాంలో ఊచకోతకు గురైన బాధితులకు అంకితమిస్తున్నట్లు సూర్య వ్యాఖ్యానించాడు.
క్రీడల్లో రాజకీయ ప్రభావిత అంశాల ప్రస్తావనపై పీసీబీ ఫిర్యాదు చేసింది. దీన్ని విచారించిన మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడవద్దని భారత కెప్టెన్‌కు సూచించారు. అయితే బుధవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పాకిస్తాన్ క్రికెటర్లు హరిస్ రవూఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నెల 21న సూపర్–4 దశలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రవూఫ్ తన చేతులతో భారత యుద్ధ విమానాలు కూలినట్లుగా సంజ్ఞలు చేశాడు.
అప్పుడే మైదానంలోని భారత అభిమానులు కోహ్లి... కోహ్లి... అంటూ బిగ్గరగా ఆరిచారు. 2022లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో రవూఫ్ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ కోహ్లి మ్యాచ్ విన్నింగ్ సిక్స్‌లతో అలరించిన సందర్భాన్ని పాక్ బౌలర్‌కు గుర్తు చేశారు. ఓపెనర్ సాహిబ్‌జాదా తన అర్ధసెంచరీ పూర్తవగానే బ్యాట్‌ను గన్‌లా ఫైరింగ్ చేస్తూ రెచ్చగొట్టాడు. ఈ నేపథ్యంలోనే భారత బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై నేడు మ్యాచ్ రిఫరీ తన నిర్ణయాన్ని వెలువరించనున్నారు.