ఎన్నో విజయాలు అందించా.. అయినా ఫెయిల్యూర్ కెప్టెన్ అంటూ! | I Was Considered A Failed Captain: virart kohli | Sakshi
Sakshi News home page

Virat Kohli: ఎన్నో విజయాలు అందించా.. అయినా ఫెయిల్యూర్ కెప్టెన్ అంటూ!

Feb 25 2023 8:01 PM | Updated on Feb 25 2023 8:03 PM

I Was Considered A Failed Captain: virart kohli - Sakshi

టీమిండియా కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన విరాట్‌ కోహ్లి.. ఐసీసీ టైటిల్‌ సాధించడంలో మాత్రం విఫలమయ్యాడు. ఇప్పటికీ కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేదనే అప్రతిష్ట విరాట్ కోహ్లిపై ఉంది. కోహ్లి సారథ్యంలో  2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌ చేతిలో ఓటమిపాలైన భారత్‌.. అనంతరం 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్‌, ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్-2021 ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైంది.

ఇక టీ20 ప్రపంచకప్‌ 2021లో లీగ్ దశలోనే టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అనంతరం భారత కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ తప్పుకున్నాడు. ఇక కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్‌ను సాధించనందుకు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లి తెలిపాడు. ఐసీసీ టోర్నీల్లో భారత జట్టును నాకౌట్ దశలకు చేర్చినప్పటికీ..తనను ఓ ఫెయిల్యూర్ కెప్టెన్‌గా చూశారని కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆర్సీబీ పోడ్‌కాస్ట్‌లో కోహ్లి మాట్లాడుతూ..  "ప్రతీ కెప్టెన్‌ తన జట్టుకు ఐసీసీ టైటిల్‌ను అందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాడు. నేను 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత జట్టుకు సారథ్యం వహించాను. జట్టుకు టైటిల్‌ను అందించేందుకు 100 శాతం ఎఫక్ట్‌పెట్టాను. అయినప్పటికీ నన్ను ఒక  ఫెయిల్యూర్ కెప్టెన్‌గా విమర్శించారు.

కానీ నేను ఎప్పుడూ వాటిని లెక్కచేయలేదు. భారత్‌ వంటి జట్టుకు సారథ్యం వహించనందుకు ఎప్పటికీ గర్వంగా భావిస్తాను. అయితే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాను. అది నాకు చాలు. అదే విధంగా ఛాంపియన్స్ ట్రోఫీ, వరుసగా ఐదు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన జట్టులో కూడా నేను ఉన్నాను. కొం‍త మంది క్రికెటర్లు ఇప్పటికీ కనీసం ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో కూడా లేరు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి" అంటూ విరాట్‌ పేర్కొన్నాడు. ఇక మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు కోహ్లి సిద్దమవుతున్నాడు.
చదవండి: రెండు రోజుల్లో భారత స్టార్‌ క్రికెటర్‌ పెళ్లి.. డ్యాన్స్‌ అదిరిపోయిందిగా! వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement