ఐపీఎల్‌ నుంచి హర్షిత్‌ రాణా అవుట్‌ | Harshit Rana Ruled Out of IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ నుంచి హర్షిత్‌ రాణా అవుట్‌

Mar 21 2026 3:59 AM | Updated on Mar 21 2026 3:59 AM

Harshit Rana Ruled Out of IPL

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అధికారిక ప్రకటన

కోల్‌కతా: భారత్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్షిత్‌ రాణా ఇదివరకే గాయంతో టి20 ప్రపంచకప్‌ ఆడలేకపోయాడు. ఇప్పుడు మెరుపుల లీగ్‌ ఐపీఎల్‌కు సైతం దూరమయ్యాడు. అతను ఆడటంపై మొదటి నుంచి సందేహం ఉన్నప్పటికీ శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. 

రాణా సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిపింది. ‘మాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. కొన్నేళ్లుగా హర్షిత్‌ మా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ముఖ్యంగా గతేడాది కాలంగా మరింత రాటుదేలాడు. అలాంటి ఆటగాడు సీజన్‌ అసాంతం దూరమవడం మాకు చాలా ఇబ్బందికరం. ఉన్నపళంగా అతని స్థానాన్ని భర్తీ చేయడం కూడా కష్టమే’ అని కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ అన్నారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ పతిరణ గాయంతో లంక పేసర్‌ సేవల్ని సైతం కోల్పోయింది.  

ఇంతకీ అతనికేమైంది? 
టీమిండియా జట్టులో సీనియర్ల గైర్హాజరీతో జట్టులోకి వచ్చిన హర్షిత్‌ సీమ్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో భారీ షాట్లతో అలరించాడు. దీంతో టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టుకూ అతన్ని కొనసాగించారు. కానీ దురదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా అతని కుడి మోకాలికి గాయమైంది. దీంతో జట్టుకు దూరమైన రాణా టీమిండియా జగజ్జేత బృందంలో భాగం కాలేకపోయాడు. అనంతరం హర్షిత్‌ మోకాలికి సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం పునరావాస శిబిరంలో ఉన్నప్పటికీ అతను పూర్తిగా కోలుకునేందుకు రీహాబిలిటేషన్‌ ప్రక్రియ ఇంకొంత కాలం కొనసాగించాల్సి ఉండటంతో ఇప్పుడప్పుడే అతను బరిలోకి దిగే అవకాశమైతే లేదు.

Advertisement
 
Advertisement
Advertisement