ఇంగ్లండ్-న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో తొలి వన్డే ఇంగ్లండ్, మూడో వన్డే న్యూజిలాండ్ గెలవగా.. రెండో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
కార్డిఫ్ వేదికగా తాజాగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడి ఆటంకాల నడుమ 33 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
అలిస్ క్యాప్సీ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. హీథర్ నైట్ 28, యామీ జోన్స్ 27, ఫ్రేయా కెంప్ 20, ఎమ్మా లాంబ్ 7, జోడీ గ్రూకాక్ 10, డానియెల్లా గిబ్సన్ 2, కెప్టెన్ ఛార్లెట్ డీన్ 16 (నాటౌట్), సోఫీ ఎక్లెస్టోన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్, రోస్‌మేరీ మైర్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జెస్ కెర్, అమేలియా కెర్, నెన్సీ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఛేదన సమయంలో వరుణుడు మళ్లీ ఆటంకాలు కలిగించడంతో న్యూజిలాండ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా ప్రకటించారు. 24.4 ఓవర్ల వద్ద భారీ వర్షం మొదలై ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆ సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బ్రూక్ హల్లీడే 42, ఇసబెల్లా గేజ్ 22 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు మ్యాడీ గ్రీన్ 37 పరుగులతో రాణించింది. మిగతా బ్యాటర్లలో సూజీ బేట్స్ 12, జార్జియా ప్లిమ్మర్ 7, అమేలియా కెర్ 1 పరుగు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, డేనియెలా గిబ్సన్ ఓ వికెట్ తీసింది.
మే 20 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ టీ20 సిరీస్ మొదలవుతుంది. తొలి మ్యాచ్ డెర్బీ వేదికగా జరుగనుంది.


