
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)భారీ శతకం బాదాడు. మొత్తంగా 258 బంతులు ఎదుర్కొనని 175 పరుగులు చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తన కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో ఘోర తప్పిదం చేశాడు.
ఇరవై ఐదు పరుగుల దూరంలో
అనవసరపు పరుగుకు యత్నించిన జైసూ.. రనౌట్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాడు. ద్విశతకానికి ఇరవై ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఢిల్లీ వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో జేడన్ సీల్స్ (Jayden Seals) బౌలింగ్‌లో జైస్వాల్.. బంతిని మిడాఫ్ దిశగా బాదగా.. అది నేరుగా ఫీల్డర్ చెంతకు చేరింది. అయితే, అప్పటికే సింగిల్ కోసం జైసూ క్రీజును వీడగా.. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మాత్రం పరిస్థితిని అంచనా వేసి తన స్థానం నుంచి కదిలినా మళ్లీ యథాస్థితికి వచ్చాడు.
తలబాదుకుంటూ
ఇంతలో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా అప్పటికే బంతిని అందుకున్న విండీస్ వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్.. దానిని వికెట్లకు గిరాటేయగా.. జైసూ రనౌట్ అయ్యాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన జైస్వాల్ తలబాదుకుంటూ మైదానం వీడాడు.
ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు గిల్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్‌కు దిగారు. జైస్వాల్ అంటే గిల్‌కు అసూయ అని.. అందుకే అతడు రన్ కోసం పిలుపునిచ్చినా సరైన సమయంలో స్పందించలేదని నిందిస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో స్పందించాడు.
జైస్వాల్ అంటే గిల్‌కు అసూయా?
‘‘నితీశ్ రెడ్డి కోసం గిల్ పరిగెడతాడు. కానీ జైస్వాల్ కోసం సింగిల్ తీయడు. ఎందుకిలా?.. ఎందుకంటే.. జైస్వాల్ అంటే గిల్‌కు అసూయ!.. అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా?
వారి విషయంలోనూ ఇలాగే చేశారు
రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలోనూ మీరు ఇలాగే చేశారు. చాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరూ కలిసికట్టుగా జట్టును గెలిపించారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఇద్దరూ ట్రోఫీని ముద్దాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
ఇక ఇప్పుడు మీరేమో మళ్లీ జైస్వాల్- గిల్‌ల గురించి ఇలాంటి ప్రచారమే మొదలుపెట్టారు. వాళ్లిద్దరు స్నేహితులు. ఇద్దరూ ఒకే జట్టుకు ఆడుతున్నారు. ఈ రనౌట్ విషయంలో తప్పు ఎవరిదైనా.. డ్రెసింగ్‌రూమ్‌లో వాళ్లిద్దరు సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో కూడా చూడండి.
అసహనం ప్రదర్శించాడంతే
ఈ ఘటన తర్వాత కూడా వాళ్లిద్దరు ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నారు. అసలేం జరిగిందో అర్థంకాక జైస్వాల్ అసహనం ప్రదర్శించాడంతే. ఫ్యాన్స్ ఆర్మీలే ఇలాంటి గొడవలు సృష్టిస్తాయి. కలిసికట్టుగా కాకుండా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఆడతారని కామెంట్లు చేస్తారు.
గిల్- జైస్వాల్‌ల ప్రయాణం ఇప్పుడే మొదలైంది. దయచేసి ఇలాంటి ట్రోలింగ్ ద్వారా వారి కెరీర్‌పై ప్రభావం పడేలా చేయకండి. వాళ్లిద్దరు కలిసి భారత క్రికెట్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడండి’’ అంటూ ఆకాశ్ చోప్రా ట్రోలర్స్‌పై మండిపడ్డాడు.
కాగా విండీస్‌తో రెండో టెస్టులో గిల్ అజేయ శతకం (129) సాధించిన తర్వాత.. ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయిన వెస్టిండీస్.. ఫాలో ఆన్ ఆడుతోంది.
చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా?