
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు (Ind vs Eng 2nd Test)కు భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అందుబాటులో ఉంటాడా? లేడా?.. గత కొన్ని రోజులుగా క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. అయితే, అతడిని ఆడించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ ట్విస్ట్ ఇచ్చాడు.
తొలి టెస్టులో ఓటమి
టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన స్టోక్స్ బృందం చేతిలో ఓటమిపాలైంది. ఐదో రోజు వరకు సాగిన ఆటలో ఆఖరికి ఐదు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.
బుమ్రాపైనే భారం
ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లలో బుమ్రా ఒక్కడే గొప్పగా రాణించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఐదు వికెట్లు కూల్చాడు. అయితే, మిగతా బౌలర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. అదే విధంగా.. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా టీమిండియా కొంపముంచాయి.
ఇదిలా ఉంటే.. ఫిట్‌నెస్, పనిభారం దృష్ట్యా బుమ్రా ఇంగ్లండ్‌తో ఐదింటిలో మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని మేనేజ్‌మెంట్ ముందే స్పష్టం చేసింది. అయితే, అవి ఏ మూడో మాత్రం చెప్పలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బుమ్రా రెండో టెస్టు బరిలో దిగితేనే బాగుంటుందని విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు టీమిండియాకు సూచిస్తున్నారు.
బుమ్రా అందుబాటులో ఉంటాడు.. కానీ
తొలి- రెండో టెస్టుకు మధ్య వారానికి పైగా విరామం దొరికింది కాబట్టి బుమ్రాను ఆడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా అందుబాటులో ఉన్నాడు. అతడి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి మేము ఆలోచిస్తున్నాం.
అయితే, ఈరోజు సాయంత్రానికి మేము సరైన కూర్పుతో జట్టును ఎంపిక చేసుకోగలం. అప్పుడే బుమ్రా విషయంలో నిర్ణయం తీసుకుంటాం. ఈ సిరీస్ ఎంత ముఖ్యమో మాకు తెలుసు.
కనీసం మూడు మ్యాచ్‌లకైనా బుమ్రా అందుబాటులో ఉంటాడు. తను జట్టు లేకపోతే ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అధిక పనిభారాన్ని మోపడం కూడా సరికాదు.
20 వికెట్లు కూల్చడం సహా భారీగా పరుగులు రాబట్టగలిగే జట్టు కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం. పిచ్‌ను చూసిన తర్వాతే స్పిన్నర్లలో ఎవరిని తుదిజట్టులో చేర్చుకుంటామో చెప్పగలము’’ అని పేర్కొన్నాడు. కాగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం (జూలై 2-6) నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది.
చదవండి: జైస్వాల్‌పై గంభీర్ ఆగ్రహం!.. ‘వేటు’ తప్పదన్న డష్కాటే!