
పాకిస్తాన్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటరుల వీరేందర్ సెహ్వాగ్, శిఖర్ ధావన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం కుదిరిన కాసేపటికే దాయాది మరోసారి తమ నీచ బుద్ధిని బయటపెట్టుకుందని మండిపడ్డారు. కుక్క తోక వంకర అనే సామెత వీరికి సరిగ్గా సరిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆపరేషర్ సిందూర్
కాగా పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు మరోసారి కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశాంతమైన బైసరన్ లోయలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. పురుషులే లక్ష్యంగా కాల్పులకు తెగబడి ఆడబిడ్డల నుదిటి సిందూరం చెరిగిపోయేలా పాశవిక దాడికి పాల్పడ్డారు.
ఇందుకు ఆపరేషర్ సిందూర్ పేరిట భారత్ గట్టి బదులిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన దాడులను సహించలేకపోయిన పాకిస్తాన్ సైన్యం.. రంగంలోకి దిగింది.
సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడటంతో పాటు సామాన్యులు, భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయగా.. భారత సైన్యం ఇందుకు దీటుగా బదులిచ్చింది. పాక్ పప్పులు ఉడకనీయకుండా గాల్లోనే డ్రోన్లు, క్షిపణులను పేల్చివేసింది. అంతేకాదు కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌ల నుంచి తమను టార్గెట్ చేసిన వారికి బుద్ధి వచ్చేలా విజయవంతంగా ఎదురుదాడులు చేసింది.
కాళ్ల బేరానికి వచ్చి.. ఆపై మరోసారి
ఈ నేపథ్యంలో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ భారత్‌ను కోరింది. అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించి.. భారత్‌ను ఒప్పించింది. ఈ క్రమంలో శాంతి సాధన లక్ష్యంగా భారత్ ఇందుకు అంగీకరించింది. అయితే, విరమణ ఒప్పందం జరిగిన కాసేపటికే పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది.
కుక్క తోక ఎప్పటికీ వంకరే
సరిహద్దుల వెంట దాడులకు దిగింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్ వంటి తదితర చోట్ల డ్రోన్లతో దాడికి దిగగా.. భారత్ వాటిని తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీరును ఉద్దేశించి.. ‘‘కుక్క తోక ఎప్పటికీ వంకరే’’ అన్నట్లు బుద్ధులు ఎక్కడకు పోతాయి అన్న అర్థంలో వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
నీచ స్వభావాన్ని మరోసారి చాటుకుంది
అయితే, ఇందుకు పాక్ నెటిజన్లు వీరూ భాయ్‌ను అసభ్యకరరీతిలో ట్రోల్ చేస్తుండగా.. భారతీయ నెటిజన్లు వారికి చురకలు అంటిస్తున్నారు. మరోవైపు.. శిఖర్ ధావన్ స్పందిస్తూ.. ‘‘తుచ్చమైన బుద్ధి గల దేశం.. తన తుచ్చమైన చేష్టలను మరోసారి ప్రపంచానికి చూపిస్తోంది’’ అంటూ పాక్ తన నీచ స్వభావాన్ని మరోసారి చాటుకుంది అన్న అర్థంలో ఘాటుగా వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే.. భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పరిస్థితులు అనుకూలిస్తే షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆదివారం జరిగే సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఐపీఎల్ హర్యాన్వీ కామెంటేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. స్వింగ్ కింగ్‌కు పిలుపు? భారత జట్టు ఇదే?