Laxmi Ratan Shukla: బెంగాల్‌ జట్టు కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌

Former Cricketer Laxmi Ratan Shukla Appointed New Bengal Coach - Sakshi

బెంగాల్‌ జట్టు కొత్త కోచ్‌ ఎవరనే దానిపై సస్పెన్స్‌ వీడింది. టీమిండియా మాజీ క్రికెటర్‌ లక్ష్మీరతన్‌ శుక్లాను బెంగాల్‌ జట్టు కోచ్‌గా ఎంపిక చేస్తూ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌( క్యాబ్) మంగళవారం రాత్రి నిర్ణయం తీసుకుంది.బెంగాల్ జట్టు కోచ్ అరుణ్ లాల్ కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 41 ఏళ్ల లక్ష్మీ రతన్ శుక్లా ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యారు. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా వి రామన్‌ను నియమించారు.

బెంగాల్ క్రికెట్ జట్టుకు విజయవంతమైన కోచ్‌గా అరుణ్ లాల్ గుర్తింపు పొందాడు. అతని పదవీకాలంలో, జట్టు 2019-20 రంజీ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైనల్లో బెంగాల్ జట్టు ఓడిపోయింది. అయితే గత నెల వరకు అరుణ్ లాల్ జట్టు కోచ్‌గా కొనసాగాడు. అయితే తాజాగా రెండో పెళ్లి చేసుకుని కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కొత్త కోచ్ కోసం వెతుకుతోంది.

అయితే కొత్తగా ఎంపికైన లక్ష్మీరతన్‌ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ రావాల్సింది. కానీ ఆయన బంగ్లాదేశ్‌ అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ తర్వాత అభిషేక్ నాయర్‌ను నియమించడంపై చర్చ జరిగింది. ఎట్టకేలకు బెంగాల్ క్రికెట్ జట్టు కోచ్‌గా లక్ష్మీ రతన్ శుక్లా నియమితులయ్యారు. లక్ష్మీ రతన్ శుక్లా భారత్ తరఫున 3 వన్డేలు ఆడి ఈసారి 18 పరుగులు చేశాడు. అలాగే 137 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 141 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. శుక్లా బెంగాల్ అండర్-23 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌ 47 మ్యాచ్‌లాడిన శుక్లా 405 పరుగులు చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top