T20 World Cup 2022: కివీస్‌కు అపురూపం.. 13 ఏళ్ల తర్వాత దక్కిన విజయం

First Win For NZ Versus Australia In Australia In White Ball Cricket Since Feb 2009 - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో గతేడాది (2021) రన్నరప్‌ న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. ఇవాళ (అక్టోబర్‌ 22) జరిగిన సూపర్‌-12 తొలి మ్యాచ్‌లో విలియమ్సన్‌ సేన.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌ను 89 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి, గతేడాది వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో చెలరేగి.. ఛాంపియన్‌ జట్టుకు షాకిచ్చింది. 

ఈ విజయం కివీస్‌కు అపురూప విజయంగా మిగిలిపోనుంది. ఎందుకంటే.. ఆ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 13 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది. కివీస్‌.. 2009 ఫిబ్రవరిలో ఆసీస్‌ను చివరిసారిగా వారి సొంతగడ్డపై ఓడించింది. 2009 ఫిబ్రవరి 6న మెల్‌బోర్న్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో కివీస్‌.. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కివీస్‌.. ఆసీస్‌ను వైట్‌బాల్‌ క్రికెట్‌లో వారి సొంతగడ్డపై ఓడించింది. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో తడబడ్డ ఆసీస్‌ 17.1 ఓవర్లలో 111 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్‌ బౌలర్లు టిమ్‌ సౌథీ (3/6), ట్రెంట్‌ బౌల్ట్‌ (2/24), ఫెర్గూసన్‌ (1/20) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్‌పై ఎదురుదాడికి దిగగా.. సాంట్నర్‌ (3/31), ఐష్‌ సోధి (1/29) తమ స్పిన్‌ మాయాజాలంతో ఆసీస్‌ ఆట కట్టించారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్‌ (28) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

అంతకుముందు ఫిన్‌ అలెన్‌ (16 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాన్‌ కాన్వే (58 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషమ్‌ (13 బంతుల్లో 26 నాటౌట్‌; 2 సిక్సర్లు) చెలరేగడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్‌కు 2, ఆడమ్‌ జంపాకు ఓ వికెట్‌ దక్కింది. 92 పరుగులతో అజేయంగా నిలిచిన కాన్వేకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top