FIFA WC 2022: ఫిఫా చరిత్రలో మాయని మచ్చలా ఐదు వివాదాలు

FIFA WC 2022: Top Five Contraversial Moments FIFA World Cup History - Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ప్రారంభానికి మరొక రోజు మాత్రమే మిగిలింది. నవంబర్‌ 20 నుంచి మొదలుకానున్న సాకర్‌ సమరం డిసెంబర్‌ 18 వరకు జరగనుంది. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న సమరంలో ఫైనల్‌ మ్యాచ్‌కు లుసెయిల్‌ స్టేడియం వేదిక కానుంది. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో విజయాలు ఎన్ని ఉంటాయో వివాదాలు కూడా అన్నే ఉంటాయి. అన్ని గుర్తుండకపోయినా కొన్ని మాత్రం చరిత్రలో మిగిలిపోతాయి. అలా ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోయిన ఐదు వివాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

మారడోనా హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌(Hand Of GOD Goal)

1986 ఫిఫా వరల్డ్‌కప్‌ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అర్జెంటీనా విశ్వవిజేతగా నిలవడం. దీనితో పాటు డీగో మారడోనా అనే పేరు కూడా కచ్చితంగా వినిపిస్తుంది. అర్జెంటీనా విజేతగా నిలవడంతో మారడోనా పాత్ర ఎంత కీలకమో అతని హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ గోల్‌ కూడా అంతే ప్రసిద్ధి చెందింది.

1986 సాకర్‌ వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్‌ చేశాడు. అందులో ఒక గోల్‌ను చేతితో కొట్టడం అధికారులెవరు గుర్తించలేదు. తర్వాత మారడోనా కొట్టిన ఆ గోల్‌.. ''హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌''(Hand OF GOD) గోల్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ గోల్‌ అప్పట్లో వివాదాస్పదమైంది.క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్‌ చేరింది.

అయితే మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. ఆ తర్వాత మారడోనా తన ఆటబయోగ్రఫీలో ''హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌'' గురించి రాసుకొచ్చాడు. మాట్లాడిన ప్రతీసారి "హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌" గోల్‌ అంటున్నారు.. కానీ ఆ చేయి మారడోనాది అన్న సంగతి మరిచిపోయినట్లున్నారని పేర్కొన్నాడు.

► జినదిన్‌ జిదానే(2006 ఫిఫా వరల్డ్‌కప్‌)


ఫుట్‌బాల్‌ బతికున్నంత వరకు 2006లో ఫ్రాన్స్‌ ఆటగాడు జినదిన్‌ జిదానే చేసిన పని గుర్తిండిపోతుందనంలో అతిశయోక్తి లేదు. టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచి ఒంటిచేత్తో ఫ్రాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే అతను ఫైనల్లో చేసిన ఒక చిన్న తప్పిదం ఫ్రాన్స్‌ ఓటమికి బాటలు వేయడంతో పాటు కెరీర్‌ను కూడా ముగించింది.

ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. అప్పటికే ఫ్రాన్స్‌ ఇటలీ గోల్‌ పోస్టులపై దాడి చేస్తూనే ఉంది. అయితే ఇక్కడే జిదానే పెద్ద పొరపాటు చేశాడు. ఇటలీ మిడ్‌ఫీల్డర్‌ మార్కో మాటెరాజీతో గొడవపడ్డాడు. ఆవేశంలో జిదానే తన తలతో మార్కో చాతిలో గట్టిగా గుద్దాడు నొప్పితో విలవిల్లాడిపోయిన మార్కో అక్కడే కుప్పకూలాడు. అయితే మొదట ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. జిదానే కూడా సైలెంట్‌గా ఉన్నాడు. కానీ రిప్లేలో జిదానే బండారం బయటపడింది. దీంతో రిఫరీ రెడ్‌ కార్డ్‌ చూపించడంతో మైదానం వదిలాడు. అలా వెళ్లిన జిదానే మళ్లీ తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టలేదు. అతనికి అదే చివరి మ్యాచ్‌ అవుతుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. జిదానే వైఖరి తప్పుబట్టినప్పటికి అతని ఆటతీరును మాత్రం అందరూ మెచ్చుకోవడం విశేషం.

► పోర్చుగల్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌ మ్యాచ్‌, 2006 ఫిఫా వరల్డ్‌కప్‌


ఈ మ్యాచ్‌ను న్యూరేమ్‌బెర్గ్ యుద్ధం అని పిలుస్తారు. పోర్చుగల్,నెదర్లాండ్స్ మధ్య ప్రి క్వార్టర్స్‌ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌ కన్నా గొడవలే ఎక్కువసార్లు జరిగాయి. అందుకే మ్యాచ్‌లో రష్యా రిఫరీ వాలెంటిన్ ఇవనోవ్ ఆటగాళ్లు చేసిన తప్పిదాలకు నాలుగు రెడ్‌ కార్డ్స్‌.. 16 సార్లు ఎల్లో కార్డులను జారీ చేశాడు. ఒక ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాచ్‌లో అన్నిసార్లు రెడ్‌, ఎ‍ల్లో కార్డులు జారీ చేయడం అదే తొలిసారి. అసలు మ్యాచ్‌లో ఎవరు నెగ్గారనే దానికంటే ఎన్ని కార్డులు జారీ అన్న విషయమే గుర్తుంది. ఇక మ్యాచ్‌లో పోర్చుగల్‌ 1-0 తేడాతో డచ్‌పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకుంది.

 2002 ఫిఫా వరల్డ్‌కప్‌లో సడెన్‌ డెత్‌ వివాదం


2002 ఫిఫా వరల్డ్‌కప్‌కు తొలిసారి ఆసియా దేశాలైన జపాన్‌, సౌత్‌ కొరియాలు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ ప్రపంచకప్‌లో సౌత్‌ కొరియా సెమీఫైనల్‌ వరకు రాగా.. జపాన్‌ మాత్రం ప్రి క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. అయితే స్పెయిన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌ ద్వారా సౌత్‌ కొరియా సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక ప్రి క్వార్టర్స్‌లో ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌ కొరియా సడెన్‌ డెత్‌ రూల్‌తో క్వార్టర్స్‌ చేరడం వివాదాస్పదంగా మారింది.

నిర్ణీత సమయంలో మ్యాచ్‌ ముగిసిన తర్వాత టైబ్రేక్‌కు దారితీస్తే అప్పుడు సడెన్‌ డెత్‌ కింద పరిగణించి.. ఇద్దరిలో ఎవరు ఎక్కువసార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేస్తే వారిని విజేత కింద లెక్కిస్తారు. దీని ప్రకారం సౌత్‌ కొరియా ముందంజలో ఉండడంతో వారినే విజయం వరించింది. దీనిపై స్పెయిన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి రూల్స్‌ ప్రకారమే చేసినట్లు మ్యాచ్‌ రిఫరీ పేర్కొనడంతో నిరాశగా వెనుదిరిగింది. ఈ వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.

 2010 ఫిఫా వరల్డ్‌కప్‌: ఘనాపై లూయిస్ సురెజ్ చివరి నిమిషంలో హ్యాండ్‌బాల్


ఈ టోర్నమెంట్‌ ఆఫ్రికా దేశమైన దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ టోర్నీలో ఘనాది డ్రీమ్‌ రన్‌ అని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఘనా క్వార్టర్స్‌ వరకు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక క్వార్టర్స్‌లో ఉరుగ్వేతో తలపడింది. మ్యాచ్‌లో ఘనా ఫ్రీ కిక్ పొందింది. ఆ సమయంలో గోల్‌పోస్ట్ వద్ద ఉన్న లూయిస్‌ సురేజ్‌ ఘనా ఆటగాడు డొమినిక్ ఆదియ్య హెడర్‌ గోల్‌ను చేతితో అడ్డుకున్నాడు.

దీంతో సురేజ్‌కు రెడ్‌కార్డ్‌ జారీ చేయడంతో మైదానం వీడాడు.  ఆ తర్వాత నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తొ నిలవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసి పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. ఇక పెనాల్టీ షూటౌట్‌లో ఉరుగ్వే గోల్‌ చేసిన ప్రతీసారి సురేజ్‌ ఎంజాయ్‌ చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇక షూటౌట్‌లో ఉరుగ్వే 4-2తో ఘనాను ఓడించి సెమీ-ఫైనల్లో అడుగుపెట్టింది.

చదవండి: సాగర తీరంలో దూసుకెళ్తున్న రేసింగ్‌ కార్లు..

క్రికెట్‌లో ప్రొటీస్‌.. ఫుట్‌బాల్‌లో డచ్‌; ఎక్కడికెళ్లినా దరిద్రమే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top