ఊరిస్తున్న సన్‌రైజర్స్‌ టైటిల్‌ సెంటిమెంట్‌!

Fans Of SRH Feel Sentiment After Two Defeats In The IPL - Sakshi

అబుదాబి: నాలుగేళ్ల క్రితం తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఆపై వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు వరకూ చేరి కడవరకూ రేసులో నిలిచింది. ఈసారి కూడా భారీ అంచనాల నడుమే పోరుకు సిద్ధమైంది ఎస్‌ఆర్‌హెచ్‌. దీనిలో భాగంగా తొలుత ప్లేఆఫ్స్‌కు చేరడంపైనే గురిపెట్టింది. కానీ సన్‌రైజర్స్‌ వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై ఢీలా పడింది.ప్రధానంగా సన్‌రైజర్స్‌ ఓడిపోయిన రెండు మ్యాచ్‌లకు కేన్‌ విలియమ్సన్‌ దూరం కావడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకూ వెళ్లి చతికిలబడ్డ వార్నర్‌ గ్యాంగ్‌.. నిన్న(శనివారం) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. (చదవండి: సన్‌రైజర్స్‌ ‘గాయం’ ఎంతవరకూ..)


ప్రధానంగా టాపార్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యం చెందడంతో సన్‌రైజర్స్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. కేవలం 142 పరుగుల సాధారణ స్కోరునే బోర్డుపై ఉంచడంతో ఆ లక్ష్యాన్ని కేకేఆర్‌ ఊదేసింది. ఫలితంగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది. కాగా, ఈ వరుస ఓటములను ఫ్యాన్స్‌ మాత్రం వేరేగా చూస్తున్నారు. అదే సమయంలో 2016 ఐపీఎల్‌ను గుర్తుకు తెచ్చుకుని ఈసారి కప్‌ మనదే అని మురిసిపోతున్నారు.  ఇక్కడ సెంటిమెంట్‌ ఆధారంగా ఎస్‌ఆర్‌హెచ్‌ టైటిల్‌ గెలుస్తుందని ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్‌ జోస్యం చెప్పేస్తున్నారు. 


ఆ సెంటిమెంట్‌ ఇదే..
2016 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించింది. ఆ లీగ్‌కు పెద్దగా అంచనాలు లేకుండా దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకొచ్చింది.  ఆ సీజన్‌లో వార్నర్‌ అమోఘంగా రాణించడంతో ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్‌.. ఇక తుది పోరులో కూడా తమ సత్తాను చాటింది. అక్కడ ఆర్సీబీని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకంది. అయితే 2016 సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి రెండు మ్యాచ్‌లను ఓడిపోయింది. అది కూడా ఆర్‌సీబీ, కేకేఆర్‌తోనే కావడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న అభిమానులు..ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జూలు విదిల్చిన ఆరెంజ్‌ ఆర్మీ
2016 సీజన్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌లను ఓడి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జూలు విదిల్చింది. ఆ ఓటముల తర్వాత హ్యాట్రిక్‌ విజయాలతో దుమ్మురేపింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి అన్నది లేకుండా రేసులోకి దూసుకొచ్చింది. ఆపై ఒకటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ మొత్తంగా 8 మ్యాచ్‌లు విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించి క్వాలిఫయర్‌-2లోకి అడుగుపెట్టింది. క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌  లయన్స్‌ ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. టైటిల్‌ పోరులో ఆర్సీబీపై 8 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టైటిల్‌ను ముద్దాడింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

తొలుత ఆర్సీబీపై రెండో మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఓడిపోవడం సన్‌రైజర్స్‌ రాటుదేలడానికి దోహదం చేస్తుందని, ఆదిలోనే ఆ జట్టు చేసిన పొరపాట్లను నుంచి గుణపాఠం నేర్చుకుని టైటిల్‌ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ధీమా వారిదే అయినా సన్‌రైజర్స్‌ జట్టులోని లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతుండటంతో ఆ జట్టు తిరిగి గాడిలో పడటానికి వరుస రెండు ఓటములు కచ్చితంగా ఒక పాఠమే. సెప్టెంబర్‌ 29(మంగళవారం) పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఈ పోరులో సన్‌రైజర్స్‌ గెలిచిందంటే తిరిగి పుంజుకున్నట్లే. వరుసగా విజయాలతో ఉన్న ఢిల్లీని ఓడించడం ఇప్పుడు ఏ జట్టుకైనా సవాల్‌గా మారింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ విభాగాల్లో అత్యంత పటిష్టంగా ఉ‍న్న ఢిల్లీని నిలువరిస్తే సన్‌రైజర్స్‌ ఒక్కసారిగా రేసులోకి వచ్చేస్తుంది.   మరి చూద్దాం తదుపరి ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో ఏం  జరుగుతుందో..?

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top