ఎట్టకేలకు పెరెజ్‌కు తొలి ఎఫ్‌1 టైటిల్‌

F1: Sergio Perez wins spectacular Sakhir Grand Prix - Sakshi

మెక్సికో డ్రైవర్‌ పెరెజ్‌కు తొలి ఎఫ్‌1 టైటిల్‌

కెరీర్‌లోని 190వ రేసులో దక్కిన విజయం

సాఖిర్‌ (బహ్రెయిన్‌): తన తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ మెక్సికో డ్రైవర్‌ సెర్గియో పెరెజ్‌ ఎట్టకేలకు ఫార్ములావన్‌ (ఎఫ్‌1)లో తొలి టైటిల్‌ను సాధించాడు. సాఖిర్‌ గ్రాండ్‌ప్రి రేసులో 30 ఏళ్ల పెరెజ్‌ విజేతగా నిలిచాడు. 87 ల్యాప్‌ల ఈ రేసులో రేసింగ్‌ పాయింట్‌ జట్టు డ్రైవర్‌ పెరెజ్‌ అందరికంటే ముందుగా గంటా 31 నిమిషాల 15.114 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2011లో ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన పెరెజ్‌ తన కెరీర్‌లోని 190వ రేసులో విజేతగా నిలువడం విశేషం. సాఖిర్‌ గ్రాండ్‌ప్రిలో ఐదో స్థానం నుంచి రేసును ఆరంభించిన పెరెజ్‌ మిగతా డ్రైవర్ల తప్పిదాలను తనకు అనుకూలంగా మల్చుకొని తొలి విజయం రుచి చూశాడు. కరోనా బారిన పడటంతో ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) ఈ రేసులో పాల్గొనలేదు. హామిల్టన్‌ స్థానంలో మెర్సిడెస్‌ జట్టు రెండో డ్రైవర్‌గా బరిలోకి దిగిన జార్జి రసెల్‌ ఒకదశలో విజయం సాధించేలా కనిపించినా... కారు టైర్‌ పంక్చర్‌ కావడంతో 80వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. ఒకాన్‌ (రెనౌ), స్ట్రాల్‌ (రేసింగ్‌ పాయింట్‌) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఎఫ్‌1 2020 సీజన్‌లోని చివరిదైన 17వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి డిసెంబర్‌ 13న జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top