Sanju Samson: ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు? నిర్మొహమాటంగా పక్కన పెట్టేయండి.. అతడిని తీసుకుంటే

Everything Has Limit Show Him Exit Door Bring Sanju: Former Cricketer - Sakshi

New Zealand vs India- Sanju Samson: ‘‘అతడు టీమిండియాకు భారంగా మారుతున్నాడు. వైఫల్యం ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోవడం ఎందుకు? అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకురండి. ఒక ఆటగాడు తరచుగా విఫలమవుతున్నా.. అతడికి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వడం సమస్యలకు దారితీస్తుంది. 

ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారీ మూల్యం చెల్లించకతప్పదు. కాబట్టి కొత్తవాళ్లకు కూడా ఛాన్స్‌లు ఇవ్వాలి’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ రితీందర్‌ సోధి అన్నాడు. యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారని.. అయినా అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని విమర్శించాడు.

ఎన్ని అవకాశాలు ఇచ్చినా
టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ కారణంగా పంత్‌ ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే, కీలక మ్యాచ్‌లలో ఛాన్స్‌ ఇచ్చినా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఐసీసీ టోర్నీలో జింబాబ్వేతో మ్యాచ్‌లో 3, ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో 6 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.


రిషభ్‌ పంత్‌

ఇక ఈ మెగా ఈవెంట్‌ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ పంత్‌ విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. రెండో టీ20లో ఓపెనర్‌గా వచ్చి 6 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో 11 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఇదిలా ఉంటే.. మరోవైపు మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మాత్రం జట్టులో అవకాశాలు కరువయ్యాయి.

సంజూకు అన్యాయం!
తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ప్రతిభను నిరూపించుకుంటున్నప్పటికీ తుది జట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పంత్‌ స్థానంలో సంజూకు అవకాశం ఇవ్వాలంటూ.. ఈ కేరళ బ్యాటర్‌ పట్ల వివక్ష తగదని నెటిజన్లు బీసీసీఐ తీరును ఎండగడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సంజూ పేరును ట్రెండ్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

పక్కన పెట్టేయండి!
ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆరంభం నేపథ్యంలో పంత్‌ను విమర్శిస్తూ.. సంజూకు అవకాశం ఇవ్వాలంటూ రితీందర్‌ సోధి అతడికి మద్దతుగా నిలిచాడు. ‘‘పంత్‌కు ఇంకెన్ని అవకాశాలు వస్తాయో కాలమే నిర్ణయిస్తుంది. సమయం మించిపోకముందే అతడు కళ్లు తెరవాలి. అయినా ప్రతిదానికి ఓ హద్దంటూ ఉంటుంది.

సుదీర్ఘ కాలం పాటు ఒకే ఆటగాడిపై ఆధారపడటం ఎంత వరకు సమంజసం. ఒకవేళ అతడు సరిగ్గా ఆడకపోతే.. నిర్మొహమాటంగా అతడిని పక్కనపెట్టాలి’’ అని సోధి.. సెలక్టర్లకు సూచించాడు. సంజూ శాంసన్‌ వంటి ఆటగాళ్లకు ఇకనైనా అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. కాగా టీమిండియా తరఫున 25 పంత్‌ ఇప్పటి వరకు 27 వన్డేలు, 66 టీ20లు ఆడగా.. 28 ఏళ్ల సంజూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటి వరకు కేవలం 26 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కాగా శుక్రవారం టీమిండియా కివీస్‌తో మొదటి వన్డేలో తలపడనుంది.

చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్‌ కార్తీక్‌ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్‌ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్‌
FIFA WC: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్‌కు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top