
కార్డిఫ్ వేదికగా వెస్టిండీస్‌తో రెండో వన్డేలో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్దమైంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జామీ ఓవర్టన్ చేతి వేలి గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
దీంతో ప్లెయింగ్ ఎలెవన్‌లో అతడి స్ధానంలో పేసర్ మాథ్యూ పాట్స్‌కు ఛాన్స్ లభించింది. ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డేలో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక విండీస్‌ను 238 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓడించింది.
ఇప్పుడు రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ భావిస్తోంది. బ్రూక్ సేన బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో స్మిత్, రూట్, డకెట్, బట్లర్, బెథల్ వంటి బ్యాటర్లు అద్బుతమైన ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో షోయబ్ మహమూద్, బ్రైడన్ కార్స్ వంటి స్టార్ పేసర్లు ఉన్నారు.
మరోవైపు విండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే వెస్టిండీస్ టీమ్‌లో షాయ్ హోప్, కార్టీ, సీల్స్ మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేరు. కనీసం రెండో వన్డేలోనైనా కరేబియన్ వీరులు చెలరేగుతారో లేదో వేచి చూడాలి.
రెండో వన్డేకు ఇంగ్లండ్ తుది జట్టు
బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.