ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌.. చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్న పంత్‌ | ENG VS IND 4th Test: Rishabh Pant 182 Runs Away From Achieving Historic Milestone In Test Cricket | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌.. చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్న పంత్‌

Jul 18 2025 10:45 AM | Updated on Jul 18 2025 10:57 AM

ENG VS IND 4th Test: Rishabh Pant 182 Runs Away From Achieving Historic Milestone In Test Cricket

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ చరిత్ర సృష్టించేందుకు అతి సమీపంలో ఉన్నాడు. జులై 23 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కాబోయే నాలుగో టెస్ట్‌లో పంత్‌ మరో 182 పరుగులు చేస్తే.. ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం డెనిస్‌ లిండ్సే పేరిట ఉంది. లిండ్సే 1966/67 ఆస్ట్రేలియా సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో (7 ఇన్నింగ్స్‌ల్లో) 86.57 సగటున 3 సెంచరీలు, 2 అర్ద సెంచరీల సాయంతో 606 పరుగులు చేశాడు.

ఈ రికార్డు బద్దలు కొట్టేందుకు పంత్‌ 182 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆరు దశాబ్దాల తర్వాత పంత్‌కు ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో పంత్‌ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీల సాయంతో 425 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో శుభ్‌మన్‌ గిల్‌ (607) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఒక వేళ పంత్‌ నాలుగో టెస్ట్‌లో ఈ అవకాశం మిస్‌ అయినా ఐదో టెస్ట్‌లో సాధించే అవకాశం ఉంటుంది.

మరో 101 పరుగులు చేస్తే..!
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో పంత్‌ 101 పరుగులు చేస్తే ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు బుద్ది కుందరన్‌ పేరిట ఉంది. కుందరన్‌ 1963/64లో ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లు ఆడి 525 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ ఉంది.

ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు..
డెనిస్‌ లిండ్సే-606
ఆండీ ఫ్లవర్‌- 540
కుందరన్‌- 525
బ్రాడ్‌ హడిన్‌- 493
గెర్రి అలెగ్జాండర్‌- 484
ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌- 473
అలెక్‌ స్టివార్ట్‌- 465
వాల్కాట్‌- 452
రిషబ్‌ పంత్‌- 425

రికార్డుల మాట అటుంచితే, అసలు పంత్‌ ఆడతాడా..?
రికార్డుల మాట అటుంచితే ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో పంత్‌ ఆడతాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మూడో టెస్ట్‌లో గాయపడిన పంత్‌.. నాలుగో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనడం లేదు.

పంత్ గాయంపై భార‌త అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెష్కటే అప్‌డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధ‌ప‌డుతున్నాడ‌ని, నాలుగో టెస్ట్ స‌మ‌యానికి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని థీమా వ్య‌క్తం చేశాడు. ముందుస్తు జాగ్ర‌త్త‌గా పంత్‌ను ప్రాక్టీస్‌కు దూరంగా ఉంచామని తెలిపాడు.

కాగా, మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు ముందే పంత్‌ చేతి వేలికి గాయ‌మైంది. దీంతో అత‌డి స్ధానంలో ధ్రువ్ జురెల్ స‌బ్‌స్ట్యూట్ వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. వికెట్‌కీపింగ్‌కు దూరంగా ఉన్నా పంత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ మాత్రం చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement