ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌కు బిగ్‌ షాక్‌.. వివాదంలో మెకల్లమ్‌!

ECB probing McCullums betting advertisements - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ టెస్టు టీమ్‌ హెడ్‌ కోచ్, న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఒక బెట్టింగ్‌ కంపెనీ ‘22బెట్‌ ఇండియా’కు అతను బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో బెట్టింగ్‌ చేయమంటూ అభిమానులను ప్రోత్సహిస్తూ అతను ఇచ్చిన ప్రకటనలు ఇటీవల వెల్లువెత్తాయి. సైప్రస్‌లో రిజిస్టర్‌ అయిన బెట్‌22తో గత నవంబర్‌లో మెకల్లమ్‌ ఒప్పందం కుదర్చుకున్నాడు.

దాంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) దీనిపై దృష్టి సారించింది. ఈసీబీ అవినీతి నిరోధక విభాగం నిబంధనల ప్రకారం ‘ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెట్టింగ్‌లో పాల్గొనడం, పాల్గొనేలా చేయడం లేదా అందుకు ప్రోత్సహించడం చేయరాదు’. టీమ్‌ హెడ్‌ కోచ్‌గా మెకల్లమ్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు ఈసీబీ ప్రకటించింది. న్యూజిలాండ్‌లో కూడా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుండటంతో ‘22బెట్‌ ఇండియా’పై ఆ దేశం నిషేధం విధించింది కూడా. ఆ దేశానికి చెందిన ‘ప్రాబ్లమ్‌ గ్యాంబ్లింగ్‌ ఫౌండేషన్‌’ సంస్థనే మెకల్లమ్‌ గురించి ఈసీబీకి తెలియజేసింది. మెకల్లమ్‌ కోచ్‌గా వచ్చాక ఆడిన 12 టెస్టుల్లో ఇంగ్లండ్‌ 10 టెస్టులు గెలిచింది.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్‌రైజర్స్‌ ఆటగాడిగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top