నా స్వప్నం సాకారమైంది: నోరిస్‌కు నాలుగో టైటిల్‌ | Dream Come True: Lando Norris Win British Grand Prix 2025 Title | Sakshi
Sakshi News home page

నా స్వప్నం సాకారమైంది: నోరిస్‌కు నాలుగో టైటిల్‌

Jul 7 2025 10:09 AM | Updated on Jul 7 2025 11:02 AM

Dream Come True: Lando Norris Win British Grand Prix 2025 Title

సిల్వర్‌స్టోన్‌: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో బ్రిటన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌ టైటిల్‌ సాధించాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో మెక్‌లారెన్‌ జట్టుకు చెందిన నోరిస్‌ నిరీ్ణత 52 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 37 నిమిషాల 15.735 సెకన్లలో ముగించి విజేతగా అవతరించాడు. సొంతగడ్డపై నోరిస్‌కిదే తొలి విజయం కాగా... ఈ సీజన్‌లో నాలుగోది.

నా స్వప్నం సాకారమైంది
‘సొంతనగరంలో టైటిల్‌ నెగ్గాలని కలలు కన్నాను. నా స్వప్నం సాకారమైంది. ఈ చిరస్మరణీయ విజయాన్ని నా మనుసులో ఎల్లవేళలా దాచుకుంటాను’ అని విజయానంతరం నోరిస్‌ వ్యాఖ్యానించాడు. మెక్‌లారెన్‌ జట్టుకే చెందిన ఆస్కార్‌ పియాస్ట్రి రెండో స్థానంలో నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన డిఫెండింగ్‌ ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

టాప్‌ ర్యాంక్‌లో పియాస్ట్రి
వర్షం అంతరాయం కలిగించిన ఈ రేసులో ఏకంగా ఐదుగురు డ్రైవర్లు కిమీ ఆంటోనెలి (మెర్సిడెస్‌), ఐజాక్‌ హద్జార్‌ (రేసింగ్‌ బుల్స్‌), బొర్టోలెటో (స్టేక్‌ ఎఫ్‌1), లియామ్‌ లాసన్‌ (రేసింగ్‌ బుల్స్‌), కొలాపింటో (అల్పైన్‌ టీమ్‌) రేసును పూర్తి చేయలేకపోయారు. 

24 రేసుల సీజన్‌లో ఇప్పటికి 12 రేసులు ముగిశాయి. పియాస్ట్రి 234 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... 226 పాయింట్లతో నోరిస్‌ రెండో స్థానంలో, 165 పాయింట్లతో వెర్‌స్టాపెన్‌ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది.

బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రిలో బ్రిటన్‌ డ్రైవర్‌కే టైటిల్‌ లభించడం ఇది 12సారి కావడం విశేషం. గతంలో స్టిర్లింగ్‌ మోస్, పీటర్‌ కోలిన్స్, క్లార్క్, స్టీవార్ట్, హంట్, జాన్‌ వాట్సన్, మాన్సెల్, డామన్‌ హిల్, జానీ హెర్బర్ట్, డేవిడ్‌ కౌతార్డ్, హామిల్టన్‌ ఈ రేసులో గెలిచారు. 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement